అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రంగనాథ స్వామి వెలసిన శ్రీరంగం తమిళనాడులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వైష్ణవ పుణ్యక్షేత్రం.ఈ పుణ్యక్షేత్రానికి దాదాపు సమానంగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో వనపర్తి సంస్థనాధీశులైన రాజరామేశ్వరరావు ఆయన సతీమణి రాణి శంకరమ్మ పేరు మీద శాలివాహన శకం 1804లో రంగనాథ స్వామి దేవాలయాన్ని నిర్మించారు.
తమిళనాడులోని శ్రీరంగం వెళ్లి రంగనాథ స్వామినీ దర్శించుకునేందుకు వీలుకాని భక్తులు శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది.
మంగళవారం నుంచి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
భక్తులు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందని దానికి అనుగుణంగా సదుపాయాలను దేవాలయ అధికారులు కల్పించారు.అంతేకాకుండా మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రంగనాథ స్వామి దేవాలయం ఆహ్లాదకర వాతావరణంలో అద్భుత శిల్పకళా ఉట్టిపడేలా భక్తులను, పర్యటకులను ఆకట్టుకుంటూ ఉంది.
హైదరాబాద్-కర్నూలు 44వ జాతీయ రహదారిపై పెబ్బేరు నుంచి 11 కిలోమీటర్లు, వనపర్తి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో రంగనాథ స్వామి దేవాలయం ఉంది.పెబ్బేరు, వనపర్తి నుంచి ప్రతి రోజు బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.మొదటి రోజు మంగళవారం ఈ బ్రహ్మోత్సవాలలో కొయిలాళ్వార్ తిరుమంజనం, విశ్వక్సేన పూజ పుణ్యాహవచన, మృత్యంగ్రహణం,అంకురార్పన మార్చి ఒకటిన ధ్వజరోహణం, దేవతాహ్వానం, భేరీ పూజ నిర్వహించనున్నారు.ఇంకా చెప్పాలంటే రెండవ తేదీన శ్రీవారి మూలమంత్ర హవనం, సూర్యప్రభ వాహన సేవ, మూడున శేషవాహన తిరువిధి సేవ,4న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం, మోహిని అలంకరణ, గరుడ వాహన సేవ, శ్రీవారి కల్యాణం,6న శ్రీవారి తిరువీధి సేవ, రథాంగ హోమం, గజవాహన సేవ నిర్వహించనున్నారు.
అంతే కాకుండా ఏడవ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు.వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని దేవాలయం అధికారులు వెల్లడించారు.
DEVOTIONAL