తెలంగాణలో అధికారమార్పు సరికొత్త రాజకీయానికి తెర తీసినట్లైంది.సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి పార్టీలు చేతులు కలపడం చాలా అరుదు.
పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతుంటారు.అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హెల్తీ పాలిటిక్స్ కు తెర తీసింది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిని గూర్చి పరామర్శించడం.కేసిఆర్ సలహాలు సూచనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరమని సిఎం రేవంత్ రెడ్డే వ్యాఖ్యానించడం.
ఎన్నికల ముందు వాడి వేడి విమర్శలతో విరుచుకు పడ్డ కేటిఆర్, రేవంత్ రెడ్డి నవ్వుతూ పలకరిచుకోవడం. వంటి పరిణామాలు చూస్తే తెలంగాణలో కాంప్రమైజ్ పాలిటిక్స్ షురూ అయ్యయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఇకపోతే బిఆర్ఎస్ హయంలో రేవంత్ రెడ్డి ఆయా కేసుల్లో జైలు పాలు అయిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడంతో కేసిఆర్ పై పగ తీర్చుకుంటారనే భావించారంతా.
కానీ తాను వ్యక్తిగతంగా ఎవరిపై పగ తీర్చుకోబోనని ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.దాంతో కాళేశ్వరం అవినీతి, ధరణి భూ కబ్జాలు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటిని వదిలేస్తారా ? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.అయితే విద్యుత్ పై గత బిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో రూ.80 వేల కోట్లు అప్పు చేసిందని తేలడంతో ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇంకెలాంటి లెక్కలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో తాము అధికారంలో ఉన్నప్పుడూ ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని, కేసిఆర్ కు పనితనం తప్ప పగతనం తేలదని మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల వ్యాఖ్యానించారు.అంతే కాకుండా తాము కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే కాంగ్రెస్ నేతలు చాలమంది ఇప్పటికే జైల్లో ఉండేవారని కూడా హరీష్ రావు అన్నారు.ఈ వ్యాఖ్యాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్.ఉచిత విద్యుత్ వంటి వాటిపై జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టకుండా ఉండేందుకే బిఆర్ఎస్ నేతలు లెట్స్ కాంప్రమైజ్ అంటున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.మరి తెలంగాణలో మొదలైన ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.