ఏపీలో మూడు రాజధానులు అంటూ వస్తున్న వార్తలపై విపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ డిమాండ్ చేస్తుండటమే కాకుండా ఈ రోజు అమరావతి పరిసర గ్రామాల ప్రజలు చేప్పట్టిన నిరసన దీక్షలకు సైతం ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, పవన్ అన్న నాగేంద్రబాబు సంఘీభావం తెలియజేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంలో పవన్ కు గట్టి షాక్ ఇచ్చేలా మెగా స్టార్ చిరంజీవి లేఖ విడుదల చేశారు.
ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అని చిరు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను విడుదల చేశారు.
ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్న చిరంజీవి గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ చుట్టూనే జరిగిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు.ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ ఉందంటూ చిరు చెప్పుకొచ్చారు.