బాబు కేబినెట్లో గుండెలు తీసిన బంటు       2018-06-08   00:27:39  IST  Bhanu C

మ‌రోసారి రాష్ట్ర కేబినెట్‌ను సీఎం చంద్ర‌బాబు విస్త‌రిస్తార‌నే ప్రచారం జోరందుకుంది. ప్ర‌స్తుతం కొంద‌రు మంత్రులపై అవినీతి ఆరోప‌ణ‌లతో పాటు వారి వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌క్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. ఎవ‌రికి ఉద్వాస‌న ప‌లుకుతారు? ఎవ‌రిని కొత్త‌గా తీసుకుంటార‌నే విష‌యంపై పార్టీలో అప్పుడే గుస‌గుస‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్త‌వారి పేర్లు ప్ర‌స్తుతం వినిపించ‌కున్నా.. ఉద్వాస‌న ప‌లికే వారి జాబితాలో మాత్రం రాయ‌లసీమ జిల్లాల‌కు చెందిన మంత్రి పేరు గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఈసారి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని పార్టీలోని సీనియ‌ర్లు కూడా స్ప‌ష్టంచేస్తున్నారు. ఆయ‌న టీడీపీలో ఉన్నా.. ప్ర‌తిప‌క్ష వైసీపీపై వ‌ల్ల‌మాలిన అభిమానాన్ని చూపుతుండ‌టాన్ని వీరు జీర్ణించుకోలేక‌పోతున్నారట‌. వైసీపీ నేత‌ల‌ను ప్రోత్స‌హిస్తూ.. టీడీపీ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కూ వెళ్లింద‌ట‌!!

తొలిసారి ఎమ్మెల్యే అయిన‌ ఆయ‌న టీడీపీలో ఉన్నా.. ఆలోచ‌న‌ల‌న్నీ వైసీపీ నేత‌ల గురించేన‌ట‌. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో దోస్తీ మ‌రింత పెరిగింద‌ట‌. గ‌తంలో వైసీపీలో చేరేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ బెడిసికొట్ట‌డంతో పాపం మ‌న‌సు చంపుకొనే టీడీపీలో కొన‌సాగుతున్నార‌ట‌. వెనుక బ‌డిన రాయ‌ల‌సీమ జిల్లాకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో మంత్రి ప‌ద‌వి అప్ప‌గించి.. ఎక్కువ ప్రాధాన్య‌మిస్తే చివ‌ర‌కు బాబుకే ఎగ‌నామం పెడుతున్నాడ‌ని పార్టీలోని సీనియ‌ర్లు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. ప్రతి చిన్న విషయంలోనూ ఆయనకు ప్రాధాన్యత కల్పిస్తూ పలు నిర్ణయాల్లో ఆయనను భాగస్వామిని చేసినా.. ఆయ‌న మాత్రం వైసీపీ నేత‌ల‌కే ల‌బ్ధి చేకూరేలా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకానికి తూట్లు పొడుస్తూ.. ఆ మంత్రి వైసీపీతో చేతులు కలిపారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆయన మొదటి నుంచి వైసీపీ వైపే చూస్తున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలోకి వెళ్లడానికి అన్నీ మాట్లాడుకుని చివరకు బేరం కుదరక టీడీపీలోనే ఉండిపోయారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవినీ చేపట్టారు. అనంత‌రం పార్టీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారట. ప్రతిపక్షానికి చెందిన వారినే ప్రోత్సహిస్తూ..వారికే అన్ని పనులు చేసిపెడుతున్నారట. కర్ణాటకకు చెందిన గనుల వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వారు చెప్పిన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా నేత‌లు చెబుతు న్నారు. తాను నిర్వహించే శాఖలో వైసీపీ అభిమానులను ప్రోత్సహిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి కూడా మొదట నుంచి వైకాపాకు అభిమానే. వై.ఎస్‌.జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ట‌. వై.ఎస్‌కు అత్యంత సన్నిహితులైన గాలి సోద‌రుల‌తో మంత్రికి సంబంధాలు ఉన్నాయట.

మంత్రి చూడడానికి అమాయకుడిలా కనిపిస్తున్నా.. గుండెలు తీసిన బంటు అని ఆయన ప్రత్యర్థులు, టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన వైసీపీ టికెట్‌తో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, అటువంటి ఆయ‌న్ను చంద్రబాబు అనవస రంగా అందలం ఎక్కిస్తున్నారని వివ‌రిస్తున్నారు. ప్రస్తుతం ఈ మంత్రి వ్యవహారంపై స‌చివాల‌యంలోనూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవల సీనియర్‌ మంత్రి ఒకరు ఆ మంత్రికి ఫోన్‌చేసి.. ఫలానా పనిచేసి పెట్టాలని కోరార‌ట‌. అదేముంది.. చేద్దాం.. అని చెప్పిన మంత్రి త‌ర్వాత‌.. సీనియర్‌ మంత్రిని తీవ్రంగా విమర్శించారట. ఆయన ఫోన్‌ చేస్తే నేను పనులు చేయాలా? అంటూ గ‌రంగ‌రం అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం మంత్రి వ్య‌వ‌హార‌మంతా సీఎం చంద్రబాబు దృష్టికి చేరిందని, రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయ‌న్నుప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు పార్టీ నేత‌లు!!