ఏపీ స‌ర్కారుకు `నాయ‌కుడు` కావ‌లెను!       2018-05-19   07:02:34  IST  Raghu V

ఇటీవ‌ల ఆంగ్ల ప‌త్రికలో ఓ క‌థ‌నం వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ఈ క‌థ‌నంలో విశేషంగా పేర్కొన్నా రు. అక్క‌డ ఇప్పుడు మ‌మ‌తా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం న‌డుస్తోంది. వాస్త‌వానికి ఇక్క‌డ బీజేపీ కూడా వేళ్లూనుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఎడ్డెం అంటే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భు త్వం మాత్రం తెడ్డెం అంటోంది. రెండేళ్ల కింద‌ట ఏకంగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే నేపాల్ స‌రిహ‌ద్దు బూచీ చూపించి.. అక్క‌డికి కేంద్ర బ‌ల‌గాల‌ను పంపించింది కూడా. ఇలా కేంద్రం నుంచి అన్ని విధాలా మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొనాల్సి వ‌స్తోంది.

అయితే, ఇటీవ‌ల రాష్ట్రంలో త‌ల‌పెట్టిన సంపూర్ణ గ్రామీణాభివృద్ధి ప‌థ‌కం, ఎల్ ఈడీ ప‌థ‌కాల‌కు 14వ ఆర్థిక సంఘం నిర్ణీత కేటాయింపుల్లో కోత‌ల‌ను నిర‌సిస్తూ.. కేంద్రంపై తీవ్ర దుమారం రేపారు. దీంతో దిగివ‌చ్చిన ప్ర‌భుత్వం రాత్రికి రాత్రి గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆయా నిధుల‌ను తిరిగి కేటాయిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌రిణామంపై పెద్ద‌గా ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. ఇదే విష‌యాన్ని ఆ ఆంగ్ల ప‌త్రిక ఉటంకిస్తూ.. మ‌మ‌తా బెన‌ర్జీ.. కేంద్రంపై పోరాడుతున్న ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టారు. అదే స‌మ‌యంలో ఏపీ ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను కూడా పేర్కొంటూ.. దీనికి కార‌ణం ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌తో ముగింపు ఇచ్చారు. ఈ క‌థ‌నంలోనే ఏపీ స‌ర్కారుకు నాయ‌కుడు ఉన్నా.. పాల‌న మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని పేర్కొన‌డం కొస మెరుపు.

నిజానికి చంద్ర‌బాబు పాల‌నా ద‌క్షుడే. అంటే.. ఏపీలో పాల‌న వ‌ర‌కు మాత్రం ఆయన ఓకే! ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచుతున్నారు. అయితే, కేంద్రం నుంచి రాబ‌ట్టుకునే విష‌యంలోను, విభ‌జ‌న హామీల‌ను సాధించ‌డంలోను బాబు ఎంత‌మేర‌కు స‌క్సెస్ అయ్యార‌నేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇది క‌దా? నాయ‌క‌త్వం అంటే! అంటున్న వారూ క‌నిపిస్తు న్నారు. ప‌రోక్షంగా స‌ద‌రు ఇంగ్లీష్ ప‌త్రిక ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించింది.

నాయ‌కుడంటే.. నాలుగు ప‌థ‌కాలు ప్ర‌క‌టించి, న‌లుగురికి చెక్కులు పంపిణీ చేయ‌డ‌మేనా? అని పేర్కొంది. అంతేకాదు.. ఎదురు వ‌చ్చిన విష‌యాన్ని ఎదిరించి నిలువ గ‌లిగిన‌ప్పుడే క‌దా.. ప్ర‌జ్ఞాపాట‌వాలు తెలిసేది!? అయితే, చంద్ర‌బాబు ఈ విష‌యంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే వార్తలు కీల‌కంగా మార‌నున్నాయి. కేంద్రంపై పోరు చేసే వారు ఇక్క‌డ కాదు.. ఢిల్లీకి వెళ్లి చేయాల‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే విప‌క్షా లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు కేంద్రంపై ఆయ‌న చేస్తున్న పోరుకు రాష్ట్రం వేదిక కాలేదా? అనేది ప‌లువురి ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఆంగ్ల ప‌త్రిక పేర్కొన్న క‌థ‌నం.. ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.