గన్నవరం వైసిపి లో నెలకొన్న వర్గ విభేదాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు.ముఖ్యంగా టిడిపి నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరువాత టిడిపికి రాజీనామా చేసి వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు.పార్టీలో చేరకపోయినా, వైసిపి నాయకుడిగానే చలామణి అవుతున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యే గా పోటీ చేయాలని వంశీ ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే అప్పటికే వైసీపీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి.ముఖ్యంగా వంశీ పై పోటీ చేసి 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, మరో నేత దుట్టా రామచంద్ర రావు వీరి మధ్య ఆధిపత్య పోరు ఉంది అనుకుంటున్న సమయంలో వంశీ రాకతో మరింతగా నియోజకవర్గం వైసీపీలో వివాదాలు పెరిగిపోయాయి.
ఇప్పటికే వైసీపీ కీలక నాయకులు అనేకసార్లు గన్నవరం పంచాయతీ చేసినా, అనేకసార్లు జగన్ తాడేపల్లి పిలిపించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా ఫలితం కనిపించడం లేదు.
దీంతో వైసిపి సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ లలో ఒకరిని తప్పకుండా వదులుకోవాల్సిన పరిస్థితి జగన్ కు ఏర్పడింది.
ఇటీవలే ఇద్దరు నేతలను జగన్ తాడేపల్లి పిలిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సమావేశం ముగిసిన తరువాత బయటకు వచ్చిన దుట్టా రామచంద్ర రావు వంశీతో కలిసి పని చేసేది లేదంటూ చెప్పడంతో వీరి మధ్య సఖ్యత కుదరలేదు అనే విషయం బయటపడింది.
వంశీ టీడీపీలో ఉండగా తమపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని, ఇప్పటికీ వాటిపై కోర్టులు చుట్టూ తిరుగుతున్నామని, అటువంటి వ్యక్తికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాము అంటే తాము ఎలా ఒప్పుకుంటాం అంటూ అసమ్మతి నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.తాను అందరిని కలుపుకొని వెళ్తున్నా… దుట్టా రామచంద్ర రావు మాత్రం కలవడం లేదని కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని వంశీ చెబుతున్నారు.దీంతో ఈ వ్యవహారం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
గన్నవరం విషయంలో జగన్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.