ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు ఎక్కడ లేని చిక్కులు వచ్చిపడ్డాయి.మొదటి నుంచి ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై వైసిపి పోరాడుతూనే వచ్చింది.
ప్రతిపక్షంలో ఉండి దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన నిర్వహించింది.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సాధించి తీరుతామని శపధాలు సైతం చేసింది.
అయితే వాస్తవ పరిస్థితుల్లో కి వచ్చేసరికి బీజేపీతో ఉన్న కొన్ని రాజకీయ అవసరాల నిమిత్తం గట్టిగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని వైసిపి ప్రస్తావించ లేకపోయింది.అదిగో హోదా.
ఇదిగో హోదా అంటూ అప్పుడప్పుడు ఆ పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులు ప్రకటనలు చేయడం తప్పించి , దాదాపు ఈ వ్యవహారం అంతా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అయితే మళ్లీ కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, దీనిని పరిష్కరించే దిశగా ముందుకు కదిలింది.
దీంతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తోందంటూ వైసిపి నాయకులు హడావుడి చేశారు.విభజన అంశాలు ప్రత్యేక హోదా అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా లీకులు రావడంతో, వైసీపీ ఈ స్థాయిలో హడావిడి చేసింది.
అయితే కేంద్ర హోంశాఖ విడుదల చేసిన లిస్టులో ప్రత్యేక హోదా అంశం లేకపోవడంతో ఒక్కసారిగా వైసీపీ డీలా పడింది.ప్రత్యేక హోదా సాధించేసాము , ఇదంతా జగన్ గొప్పదనమే అంటూ వైసిపి నాయకులు ప్రకటించుకున్నారు.
ఆ లిస్టులో ప్రత్యేక హోదా అంశం లేకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
హోదా అంశాన్ని తొలగించడానికి బిజెపి, టిడిపి కొమ్ము కావడమే కారణం అంటూ ఎదురు దాడికి దిగారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం లో వైసీపీ కేంద్ర ప్రభుత్వం పై ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది అనేది తేలాల్సి ఉంది.ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదు.
అలా సాధించలేకపోతే జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే.అలా అని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం అన్న ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ అవకాశం లేకపోవడంతో.
ఈ విషయం ఏం చేయాలనే విషయంపై ఇప్పుడు వైసిపి తర్జన భర్జన పడుతోంది.ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచినా, పెంచకపోయినా నష్టపోయేది వైసీపీ నే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.