దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకి బలమైన పునాది పడింది.ఈ సిరీస్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ముందుగానే దృఢనిశ్చయంతో బరిలోకి దిగింది.
అందుకనుగుణంగానే సౌతాఫ్రికాతో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో భారీ స్కోరు సాధించే దిశగా భారత ప్లేయర్లు ఆడుతున్నారు.తొలిరోజే ఓపెనర్ కే.ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయారు.
248 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 122 పరుగులు చేసి రాహుల్ అజేయంగా నిలవగా.మయాంక్ 123 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు సాధించాడు.కోహ్లీ 35 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా, పుజారా డకౌట్ అయ్యాడు. రహానె 40 పరుగులు, కేఎల్ రాహుల్ 122 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎంగిడి కోహ్లీ, పుజారా, మయాంక్‌లను ఔట్ చేశాడు.
మొదటిరోజు 90 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే కోహ్లీ, రహానె ఈ మ్యాచ్‌లో చాలా మెరుగ్గా ఆడారు.మయాంక్, పూజారా వెంటవెంటనే ఔట్ అయిన తరువాత కోహ్లీ నాలుగవ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు దిగాడు.రాహుల్ కు సపోర్ట్ గా నిలుస్తూ జట్టుపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చాలా చక్కగా ఆడాడు.
కనీసం అర్థ సెంచరీ లేదా సెంచరీ చేసేలా కనిపించాడు కానీ ఆఫ్‌స్టంప్ లోగిలిలో పడ్డ బంతిని టచ్ చేసి స్లిప్ లో ముల్దర్ కు చిక్కాడు.ఇక ఈ మ్యాచ్‌తోనే తన భవితవ్యం తేలనున్న నేపథ్యంలో అజింక్య రహానే చాలా దూకుడుగా ఆడి తన సత్తా చాటాడు.
చాలా సులభంగా నాలుగు బౌండరీలు బాది ఆశ్చర్యపరిచాడు.రెండో రోజు కూడా రహానె, రాహుల్ తొలి రోజు లాగానే జోరుగా ఆడితే భారీ స్కోర్ సాధించడం ఖాయం అవుతుంది.
అదే జరిగితే దక్షిణాఫ్రికా గెలవడం దాదాపు అసాధ్యం.