భారత క్రికెట్ జట్టు ఆటగాడు హర్భజన్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని నివేదికలు పేర్కొంటున్నాయి.ఈనెల 15వ తారీకు లోపు హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్భజన్ ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీకి సలహాదారుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.హర్భజన్ సింగ్ మార్చి, 2016లో టీమ్ఇండియా తరఫున ఓ టీ20 మ్యాచ్ లో ఆడాడు.
అదే అతడి చివరి మ్యాచ్ కావడం విశేషం.ఆ సమయంలో టీమిండియాలో చేరిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
దాంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు హర్భజన్ ని పక్కనపెట్టేసింది యాజమాన్యం.
అంతర్జాతీయ క్రికెట్లో చోటు దక్కించుకోకపోయినా హర్భజన్ సింగ్ దేశవాళీ క్రికెట్ తో బిజీ అయిపోయాడు.
పంజాబ్ రంజీ జట్టుకు కెప్టెన్గా కొన్నాళ్ల పాటు కొనసాగి శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను మెరుగుపరిచాడు.ఐపీఎల్ లో ముంబయి తరఫున ఆడిన హర్భజన్ ఆ తర్వాత ధోని టీం చెన్నైలో చేరాడు.
గతేడాది మాత్రం కోల్కతా టీం తరఫున ఆడాడు.అయితే అతడిని క్రికెట్లో ఆడించడం కంటే అతని సలహాలను ఫ్రాంచైజీలు ఎక్కువగా వాడుకుంటున్నాయి అని తెలుస్తోంది.
విలువైన అనుభవాలను హర్భజన్ నుంచి తెలుసుకొని జట్టు ఆటగాళ్లను సానబెట్టాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.మరి ఏ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకుంటుందో చూడాలి.ఇప్పటికే ఒక ఫ్రాంచైజీ అతడితో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.దీంతో త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి సలహాదారునిగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముంబయి జట్టు తరఫున ఆడినప్పుడు హర్భజన్ యువ ఆటగాళ్లకు తర్ఫీదునిచ్చాడు.అలాగే వేలంలో ప్లేయర్ల ఎంపిక విషయంలో కూడా అతను బాగా సహాయపడ్డాడు.