తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్‌లో కల్లోల పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ బలగాలు ఆఫ్గన్‌ను ఖాళీ చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం రాజధాని కాబూల్‌లోని పరిస్థితుల దృష్ట్యా కొందరు సైనికులను ఎయిర్పోర్ట్ వద్ద భద్రత కోసం మోహరించారు.కాబూల్ ఎయిర్పోర్ట్ నాటో దళాల కంట్రోల్లో వుండటం వల్లే పౌరుల తరలింపు ప్రక్రియ సజావుగా సాగుతోంది.
అయితే తాలిబన్లు దేశం విడిచి వెళ్లడాన్ని తప్పుబడుతున్న ‘‘ ఐసిస్ కే ’’ ఉగ్రవాద సంస్థ.కాబూల్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో దాదాపు 200 మంది వరకు చనిపోయారు.వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా వున్నారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా .ఆ మరుసటి రోజే ఐసిస్ కే ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమెరికా సైనికులకు అగ్రరాజ్య ప్రజలు నివాళులర్పించారు.ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు కూడా సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు.
దేశవ్యాప్తంగా వున్న పలు నగరాల్లో అమర జవాన్ల సంస్మరణార్థం.కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.
అలాగే సైనికుల ప్రాణాలను తీసిన వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
సైనికులకు నివాళులు అర్పించేందుకు గాను యూఎస్ కేపిటల్ బిల్డింగ్ వద్ద వున్న చెరువు వద్ద భారతీయ అమెరికన్ ప్రజలు గుమిగూడారు.
ఈ సందర్భంగా అడపా ప్రసాద్ అనే కమ్యూనిటీ కార్యకర్త మాట్లాడుతూ.కాబూల్‌లో ఉగ్రదాడి హేయమైన చర్య అన్నారు.ఉగ్రవాద బాధిత దేశమైన భారత్ నుంచి వచ్చిన తాము.ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
అటు న్యూయార్క్, జెర్సీ సిటీ, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, అట్లాంటా, హ్యూస్టన్, బోస్టన్, డల్లాస్, చికాగో, ఒహియో కొలంబస్, కనెక్టికట్ వంటి నగరాల్లోనూ సైనికుల సంస్మరణార్థం కొవ్వుత్తుల ర్యాలీలు జరిగాయి.టెక్సాస్‌లో జరిగిన కార్యక్రమంలో కొందరు ఆఫ్ఘన్- అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారు.హ్యూస్టన్‌లో జరిగిన కొవ్వుత్తుల ర్యాలీలో అనేక మంది పూలు, ప్లకార్డులతో పాటు మరణించిన సైనికుల చిత్రపటాలను చేతపట్టుకున్నారు.