కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.
ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఆక్సిజన్, వైద్య సామాగ్రి, మందులు ఇండియాకు చేరుకుంటున్నాయి.అటు పుట్టెడు కష్టంలో వున్న జన్మభూమికి ఎన్ఆర్ఐలు సైతం బాసటగా నిలుస్తున్నారు.
పలుదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయ సంఘాలు భారీగా విరాళాలను సేకరించి ఇండియాకు అవసరమైన వైద్య సామాగ్రి సహా నిధులను అందజేస్తున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సాధారణ ప్రజలే అల్లాడుతున్న వేళ.దివ్యాంగుల పరిస్ధితి దుర్భరంగా మారింది.అటు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోనూ పరిస్థితులు దారుణంగా వున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌లో కోవిడ్‌తో అల్లాడుతున్న వికలాంగులకు సాయం చేసేందుకు అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ సంస్థ ముందుకొచ్చింది.లాస్ ఏంజిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ‘‘వాయిస్ ఆఫ్ స్పెషల్ ఎబిల్డ్ పీపుల్’’ (VOSAP) ’’ లక్ష డాలర్ల విరాళాలను సమీకరించింది.
వీటి సాయంతో భారత్‌లోని వికలాంగులకు కిరాణా సామగ్రి, పీపీఈ కిట్లు, ఇతరత్రా సాయం చేసేందుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ క్లిష్ట పరిస్ధితుల్లో అంగవైకల్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు భారత్‌లో 4,500 మంది వికలాంగులకు కిరాణా సామాగ్రి, పీపీఈ కిట్లు పంపిణీ చేశామని.రాబోయే రోజుల్లో దీనిని 10,000కు చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో బీపీఏ అనే స్వచ్చంద సంస్థ సాయంతో తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.త్వరలో హైదరాబాద్, పూణేలకు సైతం విస్తరిస్తామని తెలిపారు.10,700 మంది రిజిస్టర్డ్ వాలంటీర్లున్న VOSAP సంస్థకు ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ వుంది.
ఇకపోతే లాస్‌ఏంజిల్స్‌కే చెందిన భారత సంతతి వైద్యులు కూడా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లను కొనుగోలు చేసేందుకు నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
దక్షిణ కాలిఫోర్నియాలోని భారతీయ సమాజం విజ్ఞప్తితో తమ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందన్నారు అసోసియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ( ఏఎల్‌ఏపీఐఓ) వ్యవస్థాపకుడు డాక్టర్ భారత్ పటేల్.జాయ్ ఆఫ్ షేరింగ్, సర్వమంగళ్ ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సంస్థ భారత్‌లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.