సాధారణంగా మన దేశంలో శివుడిని ఎక్కువగా లింగరూపం లోనే పూజిస్తారు.దాదాపు అన్ని దేవాలయాలలో కూడా శివుడు లింగరూపంలోనే ఉంటాడు.
కానీ శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక శివాలయం కూడా ఉంది.అయితే ఆ ఆలయంలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లు భక్తులకు దర్శనం కల్పిస్తాడు.
మరి ఇటువంటి భిన్న రూపంలో ఉన్న శివాలయం ఎక్కడ ఉంది? ఆ విధంగా శివుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లు భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ విశేషమైన శక్తీశ్వరాలయం ఉంది.పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ శక్తి శ్వరాలయం ఉంది.
ఈ ఆలయంలో శివుడు శీర్షాసనం రూపంలో మనకు దర్శనమిస్తాడు.అంతేకాకుండా పార్వతీదేవి తన ఒడిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది.
అయితే ఈ ఆలయంలో ఎక్కడా చూడనటువంటి శివుడు విగ్రహ రూపంలో తలక్రిందులుగా దర్శనమిస్తూ ఉండటానికి గల కారణం ఉంది.అదేమిటంటే… పూర్వం ఓ రాజ్యంలో శంభురా అనే రాక్షసుడు ఉండేవాడు.అతను పెట్టే చిత్రహింసలను భరించలేక ప్రజలు, మునులు ఈ శంభుర రాక్షసుని కేవలం యమధర్మరాజు మాత్రమే చంపగలరని భావించి యముడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం తెలియజేస్తారు.అయితే ఇంతకుమునుపే శంభరాసురుడుతో పోరాడి ఓడిపోయిన యమధర్మరాజుకు తిరిగి అతనితో పోరాడే శక్తి లేదని ఆ పరమశివునికి తపస్సు చేస్తాడు.

ఆ సమయంలో శివుడు లోక కల్యాణం కోసం తపస్సు చేస్తుంటాడు.యముడు చేస్తున్న తపస్సును చూసిన పార్వతీదేవి ప్రత్యక్షమై శంభురా రాక్షసుణ్ణి చంపడానికి ప్రత్యేక ఆయుధాన్ని యమధర్మరాజు ఇవ్వడంతో ఆ ఆయుధంతో శంబరాసురుని యముడు హతమారుస్తాడు.ఆ విధంగా శంభరాసురుడు మరణించడం వల్ల అక్కడి ప్రజలు ఎంతో విముక్తి పొందుతారు.అప్పటినుంచి ఆ గ్రామాన్ని యమపురి అని పిలిచేవారు.కాలక్రమేణ యమపురి ఇప్పుడు యనమదుర్రుగా మారింది.
శంభరాసురుడు చనిపోయిన తర్వాత కూడా యమపురికి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని ఆ పరమశివుని అక్కడే కొలువై ఉండాలని యముడు శివుని ప్రార్థిస్తాడు.
అయితే అప్పటికి కూడా శివుడు తపస్సులో ఉండటం వల్ల అదే రూపంలో శివుడు కుటుంబ సమేతంగా అక్కడ కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా ఈ ఆలయంలో శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంటాడు.