కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ మాసంలో కఠిన ఉపవాసాలతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులకు పూజలను నిర్వహిస్తారు.
ఇలాంటి పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ ఉత్పన్న ఏకాదశి శుక్రవారం డిసెంబర్ 11న వస్తుంది.
కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు.ఈ ఏకాదశి రోజు తులసి కోట ముందు ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.
ఉత్పన్న ఏకాదశి ఆ మహావిష్ణువుకు ఎంతో పవిత్రమైనది.ఉపవాస దీక్షలు చేయాల్సిన ఏకాదశులలో ఈ ఉత్పన్న ఏకాదశి ఒకటిగా చెప్పవచ్చు.ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ మహావిష్ణువును కొలిచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.ఇక ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుందని భావిస్తారు.

కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాలు ఎంతో పవిత్రమైనవి.ఈ పవిత్రమైన రోజులలో ఆ శివకేశవులకు పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.కార్తీక మాసం ఏకాదశి రోజు విష్ణుమూర్తి సాగరమథనం నుంచి లేచి వచ్చి బృందావనంలో ఉన్న తులసి వద్దకు ద్వాదశి రోజున చేరుకుంటాడు.అంతేకాకుండా లక్ష్మి, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ కలిసి తులసికోటలో నివసిస్తున్నారని ప్రతీతి.
ఇంతటి పవిత్రమైన రోజున సంధ్యాసమయంలో తులసి, విష్ణుమూర్తిని ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా, సుఖ సంతోషాలతో గడుపుతారు.అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.
ఉత్పన్న ఏకాదశి రోజు మహిళలు కఠిన ఉపవాసంతో ఉండి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ విష్ణుమూర్తిని స్మరించుకోవాలి.ఉపవాస దీక్షలో ఉండేవారు తులసీ దళాలను నమలడం ద్వారా సర్వ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.