కరోనా సంక్షోభం కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యం దిశగా సాగుతోంది.దీని కారణంగా ఎన్నో కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి కూడా.ఈ పరిణామాల మధ్య విదేశీయులు అమెరికా వెళ్లి మంచి కొలువు సంపాదించడం కష్టతరమైంది.
ఈ క్రమంలో అమెరికన్లను రక్షించడానికి, విదేశీ కార్మికుల ప్రవేశాన్ని నిరోధించడానికి గాను వీసాలపై ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఆయన రెండ్రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నారు.
శనివారం ఫాక్స్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన… తాము ఆది, సోమ వారాల్లో వీసాలకు సంబంధించిన నిర్ణయాల్ని ప్రకటిస్తామన్నారు.కొత్త ఆంక్షల నుంచి మినహాయింపులు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… అవి చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ సంకేతాలిచ్చారు.
అయితే అమెరికాకు వచ్చే వలసలను పరిమితం చేయాలన్న తన చిరకాల లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ కరోనా మహమ్మారిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.ఇమ్మిగ్రేషన్‌పై కఠినమైన వైఖరిని అవలంభించడం ద్వారా త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పోందాలని ట్రంప్ భావిస్తున్నారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఏప్రిల్ నెలలో అమెరికాలో విదేశీయుల శాశ్వత నివాసంపై ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.సరిహద్దుల వద్ద పట్టుబడిన వలసదారులను వేగంగా బహిష్కరించడానికి, అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వున్న నిబంధనలను నిలుపుదల చేస్తూ ఆయన మార్చిలో కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.
ఇదే సమయంలో కెనడా, మెక్సికోలతో భూ సరిహద్దులను అనవసరమైన చోట్ల మూసివేస్తామని వెల్లడించారు.