కోవిడ్ 19 నుంచి ప్రపంచాన్ని కాపాడటంలో ముందు వరుసలో నిలుస్తున్న వారు వైద్యులే.వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తూ పలువురు వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు.
ప్రస్తుత పరిస్ధితిలో ఏం చేసినా డాక్టర్ల రుణం తీర్చుకోలేనిది.ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు వైద్యం చేసిన డాక్టర్ల రుణం తీర్చుకున్నారు.
తన ప్రాణాలు కాపాడిన వైద్యుల పేరును తన బిడ్డకు పెట్టుకుని వారిపై తనకున్న గౌరవాన్ని చూపించారు.
జాన్సన్ భార్య క్యారీ సీమండ్స్ నాలుగు రోజుల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే బిడ్డ పుట్టడానికి కొన్ని వారాల ముందే మార్చి చివరి వారంలో బోరిస్ జాన్సన్ కరోనా బారినపడ్డారు.అయితే హోం ఐసోలేషన్లో వున్న ఆయనకు వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో ఏప్రిల్ 7న ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఐసీయూలో తీవ్రంగా శ్రమించి చికిత్స అందించారు.వారి కష్టంతో జాన్సన్ కోలుకుని, తిరిగి విధులకు కూడా హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో తనకు చికిత్స అందించిన డాక్టర్లతో పాటు తన పూర్వీకుల పేర్లు కలిసివచ్చేలా కుమారుడికి విల్ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేశారు.ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించారు.ప్రాణం పోసిన వైద్యుల పేరును తమ బిడ్డకు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు.సీమండ్స్ తాత లౌరీ, బోరిస్ తాత విల్ఫ్రెడ్, జాన్సన్కు వైద్యం చేసిన డాక్టర్లు నిక్ప్రైస్, నిక్ హర్ట్ ఇలా నలుగురు పేర్లు కలిసొచ్చేలా కుమారుడి పేరు పెట్టారు.
అలాగే ‘‘తనను బాగా చూసుకున్న నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రసూతి బృందానికి ధన్యవాదాలు… సంతోషంతో నా గుండె నిండింది.అని సీమండ్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
మరోవైపు బ్రిటన్లో ఇప్పటివరకు 1,82,260 మంది కోవిడ్ 19 బారినపడా, 28,131 మంది ప్రాణాలు కోల్పోయారు.