అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం అంతుచిక్కదు.ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో.
ఎలా వ్యవహరిస్తారో కనీసం ట్రంప్ కుటుంబసభ్యులు సైతం కనిపెట్టలేరు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ఆయన మరో డెసిషన్ తీసుకున్నారు.
తన శాశ్వత నివాసాన్ని న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ నుంచి ఫ్లోరిడాకు మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.ప్రతి ఏడాది మిలియన్ డాలర్ల పన్ను చెల్లిస్తున్నప్పటికీ న్యూయార్క్‌లో ఉన్న రాజకీయ నాయకులు తనను చెడుగా చూస్తున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోనే జన్మించారు.అయితే పామ్ బీచ్ లోని తన మార్ ఏ లాగో ఎస్టేట్‌లోనే ఎక్కువగా గడిపేవారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైతం ట్రంప్ మార్ ఎ లాగోలో 99 రోజులు గడిపితే.న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో కేవలం 20 రోజులు మాత్రమే గడిపేవారని ఎన్‌బీసీ న్యూస్ ఒక కథనంలో పేర్కొంది.
ట్రంప్ తన శాశ్వతనివాసాన్ని మార్చుకోవడంపై న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో, న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు అధ్యక్షుడి నివాసం మార్పుపై వైట్ హౌస్ స్పందించలేదు.అయితే ఆయన పన్ను సంబంధమైన వ్యవహారాల కారణంగానే శాశ్వత నివాసాన్ని మార్చుకున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.ఫ్లోరిడాలో రాష్ట్ర పన్ను మరియు వారసత్వ పన్ను రెండు లేవు.
కాగా.ఎనిమిదేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను న్యూయార్క్ దర్యాప్తు అధికారులకు సమర్పించాల్సిందిగా ఓ న్యాయమూర్తి అక్టోబర్ మొదట్లో ట్రంప్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ తనతో సంబంధం ఉందని చెబుతున్న ఇద్దరు మహిళలకు చెల్లించిన డబ్బుకు సంబంధించి దర్యాప్తులో జడ్జి ఈ తీర్పునిచ్చారు.