కొబ్బరిలో కాయ పరిమాణం మెరుగ్గా ఉండి, అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇందుకోసం కొన్ని పోషకాల లోపాన్ని అధిగమించి, కొన్ని ప్రత్యేక ఎరువులను మోతాదులో కొబ్బరి చెట్లకు అందించి కాయ నాణ్యతను మెరుగు పరుచుకునే అవకాశాల అవగాహన పెంచుకోవాలి.
కొబ్బరి సాగులో నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు పచ్చిరొట్ట ఎరువులు, వరి కంపోస్ట్ ఎరువులు, సేంద్రియ ఎరువులు వినియోగించాలి.
పొటాషియం అనేది పిందెలు రాలకుండా, తెగులు రాకుండా, కాయ పరిమాణం పెరగడంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది.భాస్వరం అనేది లేత మొక్కలు దృఢంగా, లావుగా ఉండడంలో సహాయపడుతుంది.ఇక త్వరగా పొత్తులు రావడానికి లేత మొక్కల పెరుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది.
కొబ్బరి చెట్లు నాటిన ఒక సంవత్సరం నుండి సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వేప పిండి, పశువుల ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల దిగుబడి శాతం పెరుగుతుంది.
చెట్టు నాటిన 12 నెలల తరువాత 500 గ్రాముల యూరియా, 20 కేజీల పశువుల ఎరువు, 500 గ్రాముల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, 1000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ప్రతి చెట్టుకు జూన్ లేదా జూలైలో ఒకసారి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో ఒకసారి వేసుకోవాలి.ముఖ్యంగా మొక్కల వేర్లను నరికి వేయుట, మొక్కలకు ఉప్పు వేయుట అనేటివి ఆశాస్త్రీయమైన పద్ధతులు.వీటివల్ల హాని తప్ప ప్రయోజనం ఉండదు.
మొక్క చుట్టూ రెండు మీటర్ల దూరంలో గాడి చేసి పురుగులను చల్లి మట్టితో కప్పి నీరు అందించాలి.రసాయన ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేసి ఆ స్థానంలో సేంద్రీయ ఎరువుల వాడకం వీలైనంతగా పెంచాలి.
ఇలా చేస్తే నేల సారవంతంగా ఉండడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుంది.