తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.తెలుగు క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల అయినా కార్తీక మాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెబుతారు.
ఈ క్రమంలోనే కార్తీక మాసంలో భక్తులు ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.మన సనాతన ధర్మంలో దక్షిణాయనం ఉత్తరాయణం అని ఉంటాయి.
ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో దక్షిణాయనంలో కార్తీకమాసానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ మాసంలో విష్ణువు శివుడికి ఎంతో ప్రీతికరం కనుక వీరికి చేసే పూజల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నదీ జలాలతో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం మనపై ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ కార్తీక మాసం మొత్తం సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తారు.
ఇలా నిత్యం దీపారాధన చేయటం వల్ల సకల పాపాలు దూరం అవుతాయని భావిస్తారు.

ఇకపోతే కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది.కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో శుభకరమైన రోజు.ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.
కార్తీక సోమవారం ముత్తైదువులు శివుడిని దర్శిస్తే మాంగల్య బలం చేకూరుతుందని భావిస్తారు.కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL