వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీలను అందిస్తున్నాయి.మూడేళ్ల కాల వ్యవధిలో పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక మొత్తంలో వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో సానుకూలమైన నిర్ణయాలు ఉన్నాయి.వీటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కింద గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని రూ.15 లక్షల నుండి రూ.30 లక్షలకు పెంచారు.
ఇదే కాకుండా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) విషయంలో గరిష్ట పెట్టుబడి పరిమితిని సింగిల్-హోల్డర్ ఖాతాలకు రూ.4.5 లక్షల నుండి రూ.9 లక్షలకు పెంచారు.దీంతో పలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.మూడేళ్ల కాల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు ఇచ్చే వడ్డీ మొత్తాలు తెలుసుకుందాం.
DCB బ్యాంక్ మూడేళ్ల కాల వ్యవధి ఉండే FDలపై సీనియర్ సిటిజన్లకు 8.35 శాతం వడ్డీని అందిస్తోంది.ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఇది ఉత్తమ వడ్డీ రేటుగా చెప్పొచ్చు.ఇందులో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.28 లక్షలకు పెరుగుతుంది.ఆ తర్వాత ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీని ఆఫర్ చేస్తోంది.మూడేళ్ల వ్యవధి ఉండే FDలపై 8.25 శాతం వడ్డీని ఇస్తోంది.ఇందులో రూ.లక్ష ఎఫ్‌డీగా పెట్టుబడి పెడితే అది మూడేళ్లలో రూ.1.28 లక్షలకు పెరుగుతుంది.
వీటి తర్వాత సీనియర్ సిటిజన్లకు IDFC ఫస్ట్ బ్యాంక్ చక్కటి వడ్డీ రేట్లు అందిస్తోంది.మూడేళ్ల కాల వ్యవధి ఉండే FDలపై గరిష్టంగా 8 శాతం వడ్డీ ఇస్తోంది.IDFC ఫస్ట్ బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ చేస్తే అది మూడేళ్లలో రూ.1.27 లక్షలు అవుతుంది.ఈ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, బంధన్ బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.ఇవి మూడేళ్ల కాల వ్యవధి ఉండే FDలపై 7.75 శాతం వడ్డీనిస్తున్నాయి.రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఆ మొత్తం మూడేళ్లలో రూ.1.26 లక్షలు అవుతుంది.