రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి.కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.

వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.దాదాపు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతూ వచ్చాయి.

ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోత, వీటికి తోడు వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు.

కానీ,బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది.బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా,గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.సగటున 2 డిగ్రీల సెల్సీయస్‌ నుంచి 5 డిగ్రీల సెల్సీయస్‌ తక్కువగా నమోదు కావడం గమనార్హం.గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39 డిగ్రీల సెల్సీయస్,కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 20.2 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది.ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్‌ తక్కువగా నమోదు కావడం గమనార్హం.కాగా మరో రెండ్రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని,ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది.

వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు,ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చని సూచించింది.కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది.

ఆదిలాబాద్,కుమ్రుంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి,కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

రాగల నాలుగు రోజులు వర్షాలే...వర్షాలు..!
Advertisement

Latest Nalgonda News