అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన విద్యార్ధి దుర్మరణం పాలయిన ఘటన కలిచి వేస్తోంది.ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన చిరు సాయి అనే విద్యార్ధి మరో రెండు వారాలలో స్వగ్రామానికి వెళ్తాడనగా ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యి మృత్యు వాత పడటం అతడి కుటుంభంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాలోకి వెళ్తే.
తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట కు చెందిన చిరు సాయి అనే వ్యక్తి విజయవాడలో బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 11 నెలల క్రితమే అమెరికా వెళ్ళాడు.
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో స్నేహితులతో కలిసి ఉంటున్న చిరు సాయి తెలంగాణలోని స్వగ్రామానికి వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలో షాపింగ్ నిమిత్తం తన స్నేహితురాలు లావణ్య తో కలిసి షాపింగ్ చేసేందుకు కారులో బయటకు వెళ్ళారు.ఉదయం 7.30 సమయంలో బయటకు వెళ్ళారు.అదే సమయంలో భారీగా మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్నా టిప్పర్ వారిని వేగంగా డీ కొట్టింది.
దాంతో చిరు సాయి అక్కడికక్కడే మృతి చెందగా అతడితో ప్రయాణిస్తున్న లావణ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాదాన్ని చూసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
చిరు సాయి అక్క అమెరికాలోనే స్థిరపడ్డారు.దాంతో ఈ ఘటన జరిగిన తరువాత చిరు సాయి సోదరి మేఘన తల్లి తండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు.
మరో 15 రోజుల్లో ఇంటికి వస్తున్నానని కుమారుడు చెప్పాడని, ఇంటికి వచ్చే ఆలోచన లేకపోతే తన కొడుకు బ్రతికి ఉండేవాడంటూ కొడుకు లేడనే వార్త విని రోదిస్తున్న తల్లి తండ్రుల ఆవేదన అందరిని కన్నీరు పెట్టిస్తోంది.విద్యార్ధి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.