గురువులు దేవునితో సమానం:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యాల్లాంటి పౌరులను తయారు చేయవచ్చని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం( Teachers Day ) సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కవి, రచయిత రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్,ఎంపీ, ఎమ్మెల్యేలు,కలెక్టర్,జాయింట్ కలెక్టర్ తో కలిసి ఉపాధ్యాయుడు,భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Teachers Are Equal To God: Minister Komati Reddy Venkata Reddy, Teachers, Teache

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని,ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రస్తుతం సమాజంలో ఉన్నతస్థానాల్లో ఉన్నారన్నారు.తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు.

అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని,కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని,ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు.విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని, టీచర్లు పట్టదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యాల్లాంటి పౌరులను తయారు చేయవచ్చన్నారు.

Advertisement

విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

విద్యావ్యవస్థ అభివృద్ధికి తనవంతు కృషిలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి( Komatireddy Prateek Reddy ) జూనియర్ కళాశాలతో పాటు ఇటీవల బొట్టుగూడ పాఠశాలను ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నిధులతో నూతన భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా హాజరైన కవి, రచయిత,రాజ్యసభ సభ్యులు కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు.

"నేను నుండి మన" అనే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో కల్పించాలని,అలాంటి సంస్కృతి,సంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలని చెప్పారు.ఢిల్లీలో పబ్లిక్ పాఠశాలల్లో సీట్లు దొరకటం లేదని,అన్ని ప్రాంతాలలో ఆ విధమైన పరిస్థితిని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో నల్గొండ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కుందుర్ రఘువీర్ రెడ్డి,చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు వేముల వీరేశం (నకిరేకల్),మందుల శ్యామేల్ (తుంగతుర్తి),బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ),జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,టీ.పూర్ణచంద్ర,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,ఆర్డీఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి,పార్లమెంట్ సభ్యులు, ముఖ్య అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శాలువాలు,జ్ఞాపికలు, పూలమాలలతో సత్కరించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Advertisement

Latest Nalgonda News