సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే:ఇందూరు సాగర్

నల్లగొండ జిల్లా:1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు జరిగింది విమోచనమో,విలీనమో కాదని,తెలంగాణ ప్రజలకు జరిగింది ముమ్మాటికి విద్రోహ దినమేనని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరు సాగర్ పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు,విప్లవ శ్రేణులు సెప్టెంబర్ 17 ను విద్రోహదినంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో ని స్థానిక శ్రామిక భవనంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలవనోళ్లు,పోరాటంతో సంబంధం లేనోళ్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.1946-51 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ గెరిల్లా సాయుధ పోరాటం ద్వారా నిజాం నవాబు,రజాకార్ల ఆగడాలకు,అకృత్యాలకు వ్యతిరేకంగా,బలవంతపు పన్నులకు,లేవిగల్లాలకు, శిస్తులకు వ్యతిరేకంగా,భూమి,భుక్తి కోసం,వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంతో ప్రజలు పోరాడి అనేక విజయాలు సాధించుకున్నారని తెలిపారు.4 వేల మంది అమరులై 3 వేల గ్రామాలల్లో గ్రామ స్వరాజ్యాలను నిర్మించుకొని,10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంచిపెట్టారని అన్నారు.నిజాం నవాబు,ఖాసీం రిజ్వి అండదండలతో పల్లెల్లో దొరలు,భూస్వాములు,పటేల్,పట్వారీ, పెత్తందారీల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని,మహిళలపై,చిన్నపిల్లలపై హత్యాచారాలు హత్యలు చేసేవారని,ఇలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా కమ్మునిస్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు ప్రజలు సాయుధ దళాల్లో పని చేశారని,కమ్యూనిస్టుల పోరాటానికి తట్టుకోలేని నిజాం నవాబు తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని భయపడి నాటి భారత ప్రధాని నెహ్రూ,పటేల్ ముందు మొకరిల్లి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొన్నాడని అన్నారు.

అందులో భాగంగానే 1948 సెప్టెంబర్ 17 న "పోలీస్ చర్య" పేరుతో భారత యూనియన్ సైన్యాలు తెలంగాణలో నిజాం అణిచివేత పేరుతో కమ్యూనిస్టులను,వారికి సహకరించిన ప్రజలను,ఊచకోత కోయడమే గాక ప్రజల ధన,మాన,ప్రాణాలను దోచుకున్నారని, అందుకే నిజాంను శిక్షించకుండా రాజభోగాలతో సత్కరించారని గుర్తు చేశారు.అలాంటి సెప్టెంబర్ 17 ను పాలకులు అధికార ప్రయోజనాల కోసం విమోచన అని,విలీనం అని పేర్లు పెట్టడం తెలంగాణ చరిత్రను మరుగుపర్చడమేనని అన్నారు.

బీజేపీ రాజకీయ లబ్ధి కోసం విమోచన డ్రామా ఆడుతుందని,అధికార భయంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా విమోచన పల్లవి పాడుతుందని ఎద్దేవా చేశారు.సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజలకు చీకటిరోజేనని ముమ్మాటికీ విద్రోహమేనని ప్రకటించారు.

తెలంగాణ సమాజం విద్రోహంగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్,ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు బొంగరాల నర్సింహా,పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.చారి,ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి,రావుల సైదులు, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఎండలు మండిపోతున్నాయి...!

Latest Nalgonda News