ఏపీ మెగా క్రీడా టోర్నమెంట్ కు సిద్ధం అయింది.రాష్ట్రంలోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ మేరకు క్రీడా సంబురాల నిర్వహణకు గానూ ఇప్పటికే ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేస్తుంది.ఇందులో భాగంగానే ఆడుదాం ఆంధ్రాకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా క్రికెట్, ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ మరియు బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.గ్రామ, వార్డు, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరగనున్నాయి.
కాగా ఈ క్రీడలకు 15 సంవత్సరాలు నిండిన వారందరూ అర్హులే.ఈ క్రమంలో అందరూ పోటీల్లో భాగస్వాములు అయ్యేలా ఓపెన్ మీట్ ను చేపట్టనుంది ప్రభుత్వం.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపోందించడంతో పాటు విజేతలకు సర్టిఫికెట్స్, మెమెంటోలు మరియు నగదు బహుమతులు కూడా ఇవ్వనుంది.అలాగే ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను సైతం ఏర్పాటు చేయనుంది.
అయితే గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి మొత్తం ఐదు దశల్లో ప్రభుత్వం పోటీలను నిర్వహించనుంది.
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు సుమారు మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంంలో క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేందుకు శాప్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.
ఇందులో భాగంగానే సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది.
తొలి దశలో భాగంగా సుమారు 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1.50 లక్షల మ్యాచ్ లు జరగనున్నాయి.ఇందులో గెలుపొందిన విజేతలు మండల స్థాయిలో పోటీ పడతారు.
అక్కడ విజయం సాధించిన వారిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపిస్తారు.కాగా 175 నియోజకవర్గాల్లో 5,250మ్యాచ్ లలో పోటీలను నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో ఆడాల్సి ఉంటుంది.ఈ క్రమంలో 26 జిల్లాల్లో 312 మ్యాచ్ లను నిర్వహిస్తారు.
జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ ల్లో పోటీ పడే విధంగా షెడ్యూల్ ఉండనుందని తెలుస్తోంది.ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ కు డిసెంబర్ 13 వరకు గడువు ఉంది.
వెబ్ సైట్ ద్వారా లేదా 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
కాగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి సచివాలయం పరిధిలో మ్యాచ్ లు జరగనున్నాయి.మన యువతకు అవకాశాలతో పాటు క్రీడా ప్రతిభను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మన దేశపు తదుపరి క్రీడా ఛాంపియన్ లుగా మారండన్న సీఎం జగన్ ఇప్పుడే aadudamandhra.ap.gov.in లో పేరు నమోదు చేసుకోండని వెల్లడించారు.