పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ( Ratan Naval Tata)86 ఏళ్ల వయసులో కన్నుమూశారు.ఆయన బతికున్నప్పుడు తన పార్థివ దేహాన్ని విద్యుత్ తో దహనం చేయాలని కోరారు.
పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.రతన్ కోరిక మేరకే ఇప్పుడు ఆయన అంత్యక్రియలు చేపడుతున్నారు కుటుంబ సభ్యులు.
రతన్ భౌతికకాయాన్ని తీసుకు వెళ్తుంటే అది చూసి ముంబై వాసులందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.అంతా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే కన్నీరు మున్నీరవుతున్నారు.
మరోవైపు రతన్ చేసిన ఎన్నో మంచి పనులను గుర్తు చేసుకుని అలాంటి మంచి మనిషి మళ్ళీ పుట్టబోడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది.
అదే రతన్ టాటా పొందిన “అసలైన ఆనందం” సంఘటన.రతన్ ఒకానొక సందర్భంలో “నేను జీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్లను దాటి ఒక మంచి వ్యాపారవేత్త స్థాయికి వచ్చాను.
నేను ఎన్నో పనులు చేశా.అయినా నాకు పెద్దగా సంతోషం కలగలేదు.
కానీ నేను అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నా జీవితం మొత్తానికి సరిపడా సంతోషాన్ని ఇచ్చింది.’ అని చెప్పుకొచ్చారు.
ఆ పని ఏంటో కూడా ఆయనే తెలియజేశారు.ఆయన చెప్పిన దాని ప్రకారం, ఒక రోజు మిత్రుడొకరు వచ్చి రతన్ టాటాని కలిశారు.
ఆ సందర్భంగానే కొంతమంది దివ్యాంగ పిల్లలకు వీల్ ఛైర్స్ ఉచితంగా అందివ్వమని విజ్ఞప్తి చేశారు.
అలా అడిగారో లేదో వెంటనే రతన్ టాటా 200 వీల్ ఛైర్స్ ( Wheelchairs)కొనుగోలు కొన్నారు.ఆ పిల్లలందరికీ వాటిని పంపిణీ చేయమని అదే స్నేహితుడిని కోరారు.అయితే ఆ స్నేహితుడు వాటిని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయలేదు.
వాటిని మీరే పంపిణీ చేయాలంటూ రతన్ టాటాను మరో కోరిక కోరారు.అందుకు రతన్ సంతోషంగా ఒప్పుకొని పిల్లలకు తన చేతులతోనే ఆ వీల్ ఛైర్స్ అందజేశారు.
వాటిని అందుకున్న పిల్లలు చాలా ఎమోషనల్ అయ్యారు.వాటిలో కూర్చుని రెక్కలొచ్చిన పక్షుల్లా హాయిగా పరిసర ప్రాంతాల్లో తిరిగారు.
అంతేకాదు, ఆ పిల్లలందరూ వాటిపై కూర్చుని ఒక రేస్ కూడా పెట్టుకున్నారు.ఇందులో ఒక చిన్నారి గెలవగా వారికే ఆ బహుమతి వచ్చింది కానీ దాన్ని ఆ పిల్లలంతా షేర్ చేసుకున్నారు.
వాళ్లను చూసి రతన్ టాటా ఎంతో సంతోషించారు.అలా సంతోషంగా ఉన్న సమయంలో ఒక పిల్లవాడు రతన్ టాటా వద్దకు చైర్ లోనే వచ్చాడు.
ఆపై ఆయన కాలు పట్టుకుని రతన్ టాటాని అలాగే చూస్తుండిపోయాడు.రతన్ టాటా ఆ పిల్లవాడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు.
‘ఎందుకలా చూస్తున్నావ్, నీకు ఇంకేమైనా కొనివ్వాలా’ అని ఆప్యాయంగా ప్రశ్నించారు.దానికి ఆ పిల్లవాడు ‘ఏమీ వద్దు, మిమ్మల్ని ఇలాగే కాసేపు చూడొచ్చా.
ఎందుకంటే మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి, అప్పుడే స్వర్గంలో ఎప్పుడైనా మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టగలను.అప్పుడు నేను ఈ వీల్ ఛైర్ మాకు కొనిచ్చిన్నందుకు మళ్లీ థాంక్స్ చెబుతాను’ అని అన్నాడు.
ఆ పిల్లవాడి మాటలు వినగానే రతన్ టాటా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.అంతేకాదు, అప్పుడు ఆయనకు జీవితంలో ఎన్నడూ కలగని అసలైన ఆనందం కలిగింది.ఆయన కళ్ల వెంట ఆనంద భాష్పాలు కూడా రాలాయి.కోట్ల ఆస్తి సంపాదించినా, ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులను గెలిచినా ఆయనకు సంతోషం ఎప్పుడూ కలగలేదట.కానీ దివ్యాంగ పిల్లలకు చేసిన సాయంలోనే అసలైన ఆనందం దక్కిందట.ఆ తరువాత రతన్ ఇంకా ఇలాంటి ఎన్నో సహాయాలు చేసి అసలైన ఆనందాన్ని రుచి చూశారు.