ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి .ప్రధాన పార్టీలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లను సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి .
ఇప్పటికే బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఇక్కడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.ముఖ్యంగా కాంగ్రెస్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో ఉత్కంఠ నెలకొంటూ వస్తోంది .ముఖ్యంగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కీలక నేతలంతా ఆశలు పెట్టుకున్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు( Tummala Nageswara Rao ) పాలేరు నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు.కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల కూడా పాలేరు అసెంబ్లీ సీటు తనకు కేటాయించాలని షరతులు విధిస్తున్నారు.దీంతో ఈ నియోజకవర్గంలో సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే బీఆర్ఎస్ తరఫున ఖమ్మం నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠ కలిగిస్తుంది.
ఖమ్మం అసెంబ్లీ నుంచి తుమ్మల నాగేశ్వరావు పోటీ చేసే విధంగా కాంగ్రెస్ కీలక నేతలు ఒప్పించారు.
పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్( BRS ) నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందట ము ఈ మేరకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలేరు నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో ఉందట.ఖమ్మం జిల్లాలో పాలేరు , ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాలే జనరల్ కేటగిరిలో ఉన్నాయి.త్వరలోనే కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాలో ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పేర్లు ఉండబోతున్నాయట.