బంగారు తెలంగాణలో బాటలే సంతలు

రహదారులకు ఇరువైపులా వ్యాపారాలు.నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతం.

ప్రమాదాలకు నిలయాలుగా సంతలు.

తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు-ఇబ్బంది పడుతున్న వాహనదారులు.

Batale Saints In Golden Telangana-బంగారు తెలంగాణలో

సంతలకు ప్రత్యేక స్థలాలేవీ సారూ నల్గొండ జిల్లా:"సంత మా ఊరి సంత" అంటూ ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న సంతకున్న విశిష్టతను గూర్చి రాసిన పాట అందరికీ యాదికుండే ఉంటుంది.ఇప్పుడు ఐటెక్ యుగంలో ఉన్నాం కాబట్టి,ఈ జనరేషన్లో సంత యొక్క ప్రాధాన్యత గురించి కొందరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు.

కానీ,ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో,పట్నాల్లో వారాంతపు సంతలే సకల మానవ జీవన మనుగడకు పట్టుగొమ్మలని చెప్పక తప్పదు.ఎంత టెక్నాలజీ పెరిగినా,ఎన్నిరకాల మోడ్రన్ షాపింగ్ మాల్స్,సూపర్ మార్కెట్లు తెచ్చినా,హోమ్ డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ పల్లెల్లో నడిచే వారాంతపు సంతలకు వన్నెతగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో.

Advertisement

అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సంతలు,నేడు మన బంగారు తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ నిరాదరణకు గురై అంతరించిపోయే పరిస్థితిలోకి నెట్టబడ్డాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాతో పాటు,పలు మండలాల్లో నిర్వహించే వారాంతపు సంతలు సమస్యలకు నిలయాలుగా మారాయి.

నియోజకవర్గంలో హలియా,త్రిపురారం, గుర్రంపోడు మండలాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సంతలు నిర్వహిస్తారు.అయితే ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కూరగాయల సంతలకు ప్రత్యేకమైన స్థలాలు,మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రోడ్ల వెంట,వీధుల వెంట వారాంతపు సంతలను నిర్వహిస్తున్నారు.

దీంతో రోడ్డుకు ఇరువైపులా నిర్వహిస్తున్న సంతలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.సంతల కారణంగా రహదారులు మొత్తం రద్దీగా మారడంతో వారం వారం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికల సమయంలో ఈ ప్రాంతపు ప్రజా ప్రతినిధులు సంతలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తామని హామీలు ఇవ్వడం,ఓట్లు వేసి గెలిపించాక ఆ వంక తిరిగి చూడకపోవడం నాయకులకు పరిపాటిగా మారిందని వాపోతున్నారు.ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి హామీలు కురిపిస్తున్నారు తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

గత ఎన్నికల్లో ఆయా మండలాల్లో రైతు బజారులు ఏర్పాటు చేస్తామని ప్రధాన పార్టీల నాయకులు హామీలు ఇచ్చారని,కానీ,ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంతతో రద్దీగా రహదారులు త్రిపురారం మండల కేంద్రంలో సోమవారం, గుర్రంపోడులో గురువారం,హాలియా పట్టణంలో ఆదివారం సంతలు నిర్వహిస్తారు.

Advertisement

ఈ సంతలకు ఆయా మండలాలతో పాటు చుట్టముట్టూ మండలాలు,గ్రామాల నుంచి వచ్చే చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను నిర్వహించుకుంటారు.త్రిపురారం మండల కేంద్రంలో మిర్యాలగూడ-సాగర్ ప్రధాన రహదారి మీద,గుర్రంపోడులో నల్లగొండ-దేవరకొండ రహదారులకు ఇరువైపులా సంతలను నిర్వహిస్తారు.

అయితే ఇవి ప్రధాన రహదారులు కావడంతో సంతలు ఉన్న రోజు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాహనాల రద్దీ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని,అలాగే ప్రజలు కూరగాయలు,పండ్లు కొనడానికి రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంత రోజున పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటాలంటే చుక్కలు చూడాల్సి ఉంటుందని,ఆ రోజుల్లో బడికి రావాలంటే జంకుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఆయా మండలాల్లో నిర్వహించే సంతల విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రజలు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో,వేరే చోట అనువైన స్థలం లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైనే సంతను నిర్వహిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ప్రజా ప్రతినిధులు,ఉన్నతాధికారులు స్పందించి వారాంతపు సంతలు జరిగే ప్రాంతాల్లో రైతు బజారులు ఏర్పాటు చేసి,ప్రజల,వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Latest Nalgonda News