సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఏ దర్శకుడు అయినా, ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.వెంట వెంటనే సినిమాలు చేస్తాడు.
అయితే బోయపాటి శ్రీను మాత్రం అందుకు విరుద్దంగా చేస్తున్నాడు.‘లెజెండ్’ సినిమా సక్సెస్ తర్వాత ఈయన ఇప్పటి వరకు మరో సినిమాను మొదలు పెట్టింది లేదు.
ఆ మద్య ‘అల్లుడు శీను’ ఫేం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.ఆ సినిమా కూడా ప్రారంభం అయ్యింది.
అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే అటకెక్కింది.దాంతో ఈ దర్శకుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
ఈ యాక్షన్ చిత్రాల దర్శకుడు స్టార్ హీరోలతోనే సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త లేట్ చేయడం జరిగింది.ఇక ఇన్నాళ్లకు ఈయన సినిమా అధికారికంగా ఫైనల్ అయ్యింది.
మెగా హీరో అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా చేసేందుకు రంగం సిద్దం అవుతోంది.వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు.
ఈ సినిమా గీతాఆర్ట్స్‌లో తెరకెక్కబోతుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను గీతా ఆర్ట్స్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
బన్నీ ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ మూవీ పూర్తి కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.