ఏపీలో అధికార , విపక్ష పార్టీల మధ్య ఓట్ల రాజకీయం కాక పుట్టిస్తోంది.ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు .
వైసిపి మద్దతుదారుల ఓట్లను టిడిపి అక్రమంగా తొలగిస్తుందని , వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుండగా, కాదు కాదు టిడిపి మద్దతుదారుల ఓట్లను వైసిపి నేతలు అక్రమంగా తొలగిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ , నియోజకవర్గాల్లోనూ ఈ వ్యవహారం పైనే రచ్చ రచ్చ జరుగుతుంది .మరో మూడు నాలుగు నెలలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పొత్తుల అంశంపైనే ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి.ఒక పార్టీపై మరొక పార్టీ ఓట్ల విషయంపై విమర్శలు చేసుకోవడమే కాకుండా, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
తాజాగా జగ్గయ్యపేటలో ఓట్ల తొలగింపు వ్యవహారం రచ్చగా మారింది. ఫారం 7 ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని , ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు.
టిడిపికి అనుకూలంగా ఉండే మహిళల ఓట్లు తొలగించి వైసిపి సానుభూతిపరుల ఓట్లు మాత్రమే ఉంచుతున్నారు అంటూ ఆయన విమర్శలు చేశారు.ఒక వ్యక్తికి ఒక పోలింగ్ బూత్ లో మూడు, నాలుగు ఓట్లు ఉన్నాయని, అయినా తొలగించడం లేదని, టిడిపి నేతలు ఆరోపణలు చేయడమే కాకుండా , దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు .దీనికి వైసిపి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.టిడిపి నాయకులు వైసిపి ఓట్లను తొలగించారని, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వెంటనే తొలగించాల్సిందేనని చెబుతున్నారు.
జనవరి 5 నాటికి తప్పుల్లేని తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సిన నేపథ్యంలో, అన్ని పార్టీలు ఈ ఓట్ల అంశంపై ప్రధానంగా దృష్టి సారించి తమ ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయ పార్టీలకే కాకుండా ఎన్నికల సంఘం అధికారులకు తలనొప్పిగా మారింది.