ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలోని ఖలిస్తాన్ గ్రూపులు, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిజ్జర్ హత్య వెనుక భారత్ కుట్ర వుందంటూ ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.తాజాగా ట్రూడో ప్రకటన దీనికి బలం చేకూర్చినట్లయ్యింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.భయపడినట్లుగానే సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా స్పందిస్తోంది.
హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.
ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే( Sikhs For Justice ) ఆరోపించింది.
ఈ మేరకు ఆ సంస్థ కీలక నేత, న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannun ) ఓ వీడియోను విడుదల చేశారు.పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ గ్రూప్ ప్రతినిధి విజయ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాము ఇప్పుడు పూర్తి స్థాయిలో హిందూ ఫోబియాను చూస్తున్నామన్నారు.
1985లో దేశంలో నెలకొన్న పరిస్ధితులు మరోసారి పునరావృతమవుతాయని జైన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.1985 జూన్‌లో ఎయిరిండియా విమానంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబులు పెట్టడంతో 307 మంది ప్రయాణీకులు, 22 మంది సిబ్బంది మరణించారు.కెనడా( Canada ) చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఉగ్రదాడి.
నాటి ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం కెనడా ఏటా జూన్ 23న ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
ఇప్పటికే కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఆలయ గోడలపై భారత వ్యతిరేక పోస్టర్‌లను అతికించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఖలిస్తాన్ మద్ధతుదారులు అలజడి రేపుతున్నారు.హిందూ వ్యతిరేక పక్షపాతం, వివక్షను నివారించడానికి మానవ హక్కుల కోడ్‌లోని పదాల పదకోశంలో హిందూ ఫోబియాను గుర్తించాలని కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఓ పిటిషన్ పెండింగ్‌లో వుంది.ఈ పిటిషన్‌పై ఇప్పటి వరకు దాదాపు 9000 మంది సంతకాలు చేశారు.