తెలంగాణలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయింది .వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తూ.
వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.ఇక అధికార పార్టీ బిఆర్ఎస్( BRS party ) లో ఈ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేయించిన కేసీఆర్ దానికనుగుణంగా మొదటి విడత జాబుతాను సిద్ధం చేసుకొని త్వరలోనే ప్రకటించబోతున్నారు.ఈ లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.కెసిఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా, గెలుపు ఆయన ఖాతాలో వేసుకుంటూ ఉంటారు.వరుసగా సిద్దిపేటలో గెలుస్తూ వచ్చిన కేసీఆర్( CM kcr ) కరీంనగర్ ఎంపీగాను గతంలో పోటీ చేసి గెలుపొందారు .ఆ తరువాత మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.అలాగే మెదక్ ఎంపీగా కూడా గెలిచారు. ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి విజయాన్ని అందుకున్నారు. వరుసగా రెండోసారి గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధించారు.ఇలా ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం ఆయన ఖాతాలో పడడం ఆనవాయితీగా మారింది.
అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ( Gajwel Constituency )వదిలి మేడ్చల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.ఇక మరి కొంతమంది మాత్రం యాదాద్రి ఆలయం ఉన్న ఆలేరు నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతుండగా, కాదు కాదు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని, కామారెడ్డి నియోజకవర్గంలోనూ సర్వే చేస్తున్నారని అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతుంది.ఈ వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో కేసీఆర్ మాత్రం తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో ఎటువంటి లీకులు బయటకు రాకుండా చూసుకుంటున్నారు.మొదటి విడత అభ్యర్థులు ప్రకటన పూర్తయిన తర్వాతే తాను పోటీ చేయబోయే నియోజకవర్గంను ప్రకటించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట.