రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందు కు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.
ఓ.ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడుభూములు, తెలంగాణ కు హరితహారం, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఇంటర్ పదవ తరగతి పరీక్షలు, ఐడిఓసి పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు.కంటి వెలుగు అంశం పై రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 86.5 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 14.23 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 10.37 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేయగా, జిల్లాలకు 5 లక్షలకు పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్ తెలిపారు.
జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలపై ప్రజలలో మరింత విస్తృత ప్రచారం కల్పించాలని, రిఫరల్ ఆసుపత్రిలో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని, మహిళలకు పూర్తి చికిత్స ప్రాధాన్యతతో ఉచితంగా అందిస్తామని అన్నారు.భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతి పై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్ పట్టాలను మార్చి చివరి నాటికి పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ రుసుము వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు 76 కు సంబంధించి పెండింగ్ లో ఉన్న రుసుంను వసూలు చేసి పట్టాల పంపిణీ మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించిన 1039 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నాయని, వీటి ల్యాండ్ స్కెచ్ ఇంటి పట్టాల వారిగా సరిహద్దులతో వివరాలు, ఇంటి నిర్మాణానికి అనుకూలత వంటి అంశాల పై నివేదిక అందించాలని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపులో పురోగతి ఉందని సీఎస్ అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 322 ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేశామని, మరో 9 వేల 411 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.పోడు భూముల పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభం అవుతుందని పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సూచించారు.
అగ్ని ప్రమాధాల నియంత్రణ కు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో సైతం అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.జిల్లాలో జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో , పెద్ద అపార్ట్మెంట్, షాపింగ్ మాల్స్ ఫైర్ సెఫ్టీ ఉండాలని అన్నారు.
అగ్ని ప్రమాదాల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని, అలసత్వం వహించవద్దని అన్నారు.జిల్లాలో ఫైర్ సేఫ్ట కోసం ఆడిట్ నిర్వహించాలని అన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించుకున్న సమీకృత కలెక్టరేట్ లలో జిల్లాలలో మార్చి చివరి నాటికి ప్రైవేట్ బిల్డింగ్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేసి షిఫ్ట్ కావాలని, తదుపరి రెంటల్ బడ్జెట్ ఉండదని సీఎస్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైకుంఠ దామం నిర్మాణం పూర్తి చేసామని వాటిని వినియోగంలోకి తీసుకోని రావాలని, వైకుంఠదామాలో విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా సౌకర్యం కల్పన పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.జిల్లాలకు నిర్దేశించిన బృహత్ పల్లె ప్రకృతి వనాల, పల్లె ప్రకృతి వనాల లక్ష్యాలు పూర్తి చేయాలని, రానున్న వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎస్ అన్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం జరిగేలా కృషి చేయాలని అన్నారు.జిల్లాలకు నిర్దేశించిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు.ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించు 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, 6 పేపర్లు పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని, కాంపోజిట్ సైన్స్ పరీక్ష మాత్రం 9.30 నుంచి 12.50 వరకు ఉంటుందని, దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.ప్రశ్న పత్రాల రవాణా, వాటి స్టోరెజ్, పరీక్షా కేంద్రాల్లో వసతుల కల్పన మొదలగు ఏర్పాట్లు కలెక్టర్ పర్యవేక్షించాలని తెలిపారు.
తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాబోయే వర్షాకాలంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని తెలిపారు.వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, రాబోయే 3 నెలలు మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో వివిధ అంశాల పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని, ఆరోగ్య మహిళ కింద అందించే సేవల పై విస్తృత ప్రచారం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కింద పెండింగ్ ఉన్న రుసుము చెల్లింపుల పై రెవెన్యూ డివిజన్ అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు శ్రీనివాస రావు, పవన్ కుమార్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ అధికారి మోహన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.