తల్లి ,తండ్రి తరువాత గురువును దైవంగా భావిస్తారు.ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బంగారు బాట వేసేది ఉపాధ్యాయులే.విద్యార్థుల సక్సెస్ వెనక ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంటుంది.అటువంటి ఉపాధ్యాయులే విద్యార్థినులను లైంగికంగా వేధిస్తే సమాజంలో ఇంతకుంటే దారుణం మరొకటి ఉండదేమో.అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం నల్లగుంట్ల పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు ఇంచార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తు, విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చదువుకోవడానికి స్కూలుకువచ్చే 8, 9, 10 వ తరగతి విద్యార్థినులపై కొద్దిరోజులుగా ఆదినారాయణ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.విద్యార్థినులతో అసభ్యంగా పుట్టుమచ్చలు చూపాలంటూ, అసభ్యకర మాటలతో వేధించేవాడు.ఆదినారాయణ కు భయపడి బాలికలకు ఈ విషయం ఎవరితో చెప్పాలో అర్ధం కాలేదు.
జనవరి 24న స్కూల్లో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా స్కూల్లో జరిగే కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హాజరయ్యారు.విద్యార్థినులంతా ధైర్యం చేసి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి చెప్పారు.తర్వాత ఆ ఉపాధ్యాయుడిపై నిఘా పెట్టి అతని ప్రవర్తనను గమనించారు.ఉపాధ్యాయుడు మీద బాలికలు చేసిన ఆరోపణలు నిజం అని తెలియడంతో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షికి సమాచారం ఇచ్చారు.
డీఈవో మీనాక్షి గారు ఆదినారాయణ ను సస్పెండ్ చేసి, ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఎవరైనా విద్యార్థులు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలాంటి ఉపాధ్యాయులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠినంగా శిక్షిస్తామని డీఈవో మీనాక్షి హెచ్చరించారు.