2024 ఎన్నికలపై జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.ఆ ఎన్నికల్లో వైసిపి గతంతో పోలిస్తే మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు.
తను మాదిరిగానే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆలోచించాలని రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమయం కావాలని చెబుతున్నారు.అంతేకాదు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు.
ఫలితాలకు అనుగుణంగా సదరు ఎమ్మెల్యేలకు జగన్ హితబోధ చేస్తున్నారు.ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల అందరి పనితీరు పైన జగన్ నిఘా వర్గాల నివేదికలు తెప్పించుకున్నారు.
దీంతోపాటు రాజకీయ వ్యవహర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం ద్వారా సర్వే చేయించుకున్నారు.
ఈ సర్వేలో దాదాపు సగం మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గానే ఉన్నా, చాలామంది పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉందని, ముఖ్యంగా 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదు అనే రిపోర్టులు జగన్ కు అందాయి.
ఇప్పటికే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.కొద్ది నెలల క్రితం నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ పనితీరు సక్రమంగా లేని వారి పేర్లను చదివి మరి పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అని తేల్చి చెప్పారు.
అయితే మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన జగన్ ఆ 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని, ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజల్లో బలం పెంచుకునే విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు.గతంలో ఇదే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ఇప్పుడు మరోసారి వారికి అవకాశం ఇస్తున్నానని , వచ్చే ఏప్రిల్ లో సర్వేలు చేయిస్తానని , అప్పటికి పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చేసారట.