దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది.2009 నుంచి 2018 వరకూ తొమ్మిది ఏండ్లపాటు జుమా దేశాధ్యక్షుడిగా వ్యవహరించాడు.ఆ సమయంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఆయన ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపిస్తూ గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.దీనిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో జుమాకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని కమిషన్ సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది.1999లో జుమా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా వున్నప్పుడు 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ కొనుగోలు ఒప్పందంలో అవినీతి చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలు వున్నాయి.కాగా 2009 నుంచి 2018 వరకు తన పాలనా కాలంలో అవినీతి జరిగిందంటూ జోండో కమీషన్ చేస్తున్న ఆరోపణలను జుమా ఖండించారు.
ఈ మేరకు దేశ ప్రధాన న్యాయమూర్తికి 21 పేజీల లేఖ రశారు.నిరాధారామైన ఆరోపణల ద్వారా ప్రజల్లో సానుభూతిని పొందాలనుకోవడం అవివేకమన్నారు.ఎందరో ప్రాణాలు కోల్పోయి సాధించిన రాజ్యాంగాన్ని అగౌరవపరచొద్దని జుమా హితవు పలికారు.జుమా తనకు అత్యంత సన్నిహితులైన భారత సంతతి వ్యాపారులైన గుప్తా సోదరులకు జాతి వనరులను దోచుకోవడానికి అనుమతించారన్నది ప్రధాన ఆరోపణ.జాకబ్ జుమాతో సాన్నిహిత్యం ద్వారా గుప్తా సోదరులైన అజయ్, అతుల్, రాజేశ్‌లు బిలియన్ డాలర్ల విలువైన అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌పీఏ దర్యాప్తులో తేలింది.ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో జుమా పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది.
జుమా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గుప్తా బ్రదర్స్ రాజకీయాల్లోనూ తమ హవా కొనసాగించారు.అధ్యక్షుడితో సత్సంబంధాలు పెంచుకున్న వీరు కేబినెట్‌లో ఎవరు ఉండాలి? ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి? అన్న విషయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు.గుప్తా బ్రదర్స్‌ది యూపీలోని షహరాన్‌పూర్.స్థానిక రాణి బజార్‌లో వీరి తండ్రి శివకుమార్‌కు రేషన్ షాపు ఉండేది.వీరిని స్థానికులు ఇప్పటికీ ‘రేషన్ షాపోళ్లు’ గానే పిలుస్తుంటారు.తండ్రి స్మారకార్థం ఓ దేవాలయాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఇక్కడి శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారు.
1985లో గుప్తా కుటుంబం రాణి బజార్ నుంచి తన మకాంను ఢిల్లీకి మార్చింది.1993లో అక్కడి నుంచి దక్షిణాఫ్రికాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన జొహన్నెస్‌బర్గ్‌కు వలస వెళ్లారు.అక్కడ వ్యాపారం ప్రారంభించిన గుప్తా బ్రదర్స్ అనతికాలంలోనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.మైనింగ్, మీడియా, ఇంజినీరింగ్ ప్రాజెక్టులు.ఇలా ప్రతీ రంగంలోనూ వీరి హవా కొనసాగింది.ఈ అన్నదమ్ములకి మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా కుటుంబం అండగా నిలిచింది.2009లో జుమా ఏకంగా అధ్యక్షుడు కావడంతో దేశంలో గుప్తా బ్రదర్స్‌కు ఎదురు లేకుండా పోయింది.
ఆయన అండతో వీరు కోట్లాది రూపాయలు సంపాదించి.దక్షిణాఫ్రికాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది.గుప్తా సోదరుల కుంభకోణాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో అది జుమా మెడకు చుట్టుకుంది.
సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జుమా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.కేసులు, అరెస్ట్‌ల భయంతో గుప్తా బ్రదర్స్ యూఏఈలో తలదాచుకున్నారు.అప్పటి నుంచి వారిని దక్షిణాఫ్రికాకు రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.