అనుకున్నదే అయ్యింది.డెల్టా వేరియెంట్ (భారత రకం) వైరస్ యూకే కొంప ముంచింది.
కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు.ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు ఈ నెల 21న ముగించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
అందుకు తగినట్లుగా మార్గదర్శకాలను సైతం రూపొందించింది.కానీ ఈలోగా డెల్టా వేరియెంట్ చాప కింద నీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో అన్‌లాక్ ప్రక్రియ నాలుగు వారాలు వెనక్కి వెళ్లింది.
జూన్ 21 తర్వాత తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని ఆశపడ్డ దేశ ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం నిరాశను కలిగించింది.
అంతకుముందు బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ.
కరోనా డెల్డా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఆంక్షలు జూలై 19వ తేదీ వరకు అమలులో ఉంటాయని, ఆ తర్వాత పొడగించాల్సిన అవసరం ఉండదని బోరిస్ జాన్సన్ ఆకాంక్షించారు.
వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా రెండో డోసును వేగవంతం చేస్తామని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.కాగా, ఆదివారం బ్రిటన్‌లో కొత్తగా 7,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.
ఎనిమిది మంది మరణించారు.వారం కిందటి కేసులతో పోలిస్తే గతవారం కేసుల్లో 49 శాతం పెరుగుదల కనిపించింది.
అయితే భారత్‌లో వ్యాప్తికి కారణమైన కరోనా వేరియంట్ కేసుల పెరుగుదల బ్రిటన్‌లో అన్‌లాక్ ప్రక్రియకు తీవ్రమైన విఘాతం కలిగించవచ్చని కొద్దిరోజుల క్రితం ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.అదే మాట ఇప్పుడు అక్షరాల నిజమైంది.
గత ఆదివారం డెల్టా వేరియెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.కరోనాలోని ఇతర వేరియంట్లు సంక్రమిస్తే ఇంట్లో ఒక్కరు మాత్రమే వైరస్ ప్రభావానికి గురయ్యేవారని, కానీ ఈ డెల్టా వేరియంట్ వల్ల ఇంట్లోని వారందరూ కరోనా బారినపడుతున్నారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) వెల్లడించింది.కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని మ్యూటేషన్‌లతో పోలిస్తే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించింది.కుటుంబాలకు కుటుంబాలే పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడడం వెనక డెల్టా వేరియంట్ కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు తెలియజేశారు.అల్ఫా వేరియంట్‌గా పిలిచే బి.1.1.7తో పోలిస్తే డెల్టా వేరియంట్ 64 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు.