ఏదో ఒక రూపంలో వైసీపీ కి ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన శైలిలో చుక్కలు చుపిస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు.మొదటి నుంచి నిమ్మగడ్డ, వైసీపీ నాయకులకు మధ్య ఏర్పడిన విభేదాలతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి హోదాలో ఏ నిర్ణయం తీసుకున్నా, అది వైసీపీని ఉద్దేశించి, ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనూ,రాజకీయ వర్గాల్లోనూ నెలకొంటోంది.
ఇదిలా ఉంటే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.అయితే ముందుగా ఆన్లైన్ ద్వారా నామినేషన్లు స్వీకరణ చేయాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసినా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఈ వ్యవహారంపై రమేష్ కుమార్ చాలా సీరియస్ అవుతున్నారు.ఈ మేరకు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ లను ఆఫీసుకు రావలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఆన్ లైన్ ద్వారా నామినేషన్ స్వీకరించాలని చెప్పినప్పటికీ, ఎందుకు దానిని అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని నిమ్మగడ్డ లేఖ రాసినట్లు తెలుస్తోంది.వైసీపీ మినహా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఆన్లైన్ ద్వారా నామినేషన్ స్వీకరించాలని కోరిన అంశాన్ని నిమ్మగడ్డ లేఖలో ప్రస్తావించారు.ఇప్పటికే చాలా చోట్ల వైసిపి- టిడిపిల మధ్య పోరు తారా స్థాయిలో ఉంది.చాలా చోట్ల నామినేషన్ వేయకుండా ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రయత్నాలు చేయడం, అవి కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం వంటి వ్యవహరాలతో పరిస్థితి అదుపు తప్పే విధంగా కనిపిస్తున్న నేపథ్యంలో, ఆన్లైన్ నామినేషన్ల ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎవరైనా ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా నామినేషన్ ఆన్లైన్ ద్వారా వేసేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ మినహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా చాలా చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసిపి బలవంతంగా ఏక గ్రీవాలకు పాల్పడుతోందని, ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుదనే ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో ఈ ఆన్లైన్ నామినేషన్ ల అంశం పై నిమ్మగడ్డ ఎక్కువ ఫోకస్ చేసినట్టు గా కనిపిస్తోంది.
ఈ ప్రక్రియ కనుక అమల్లోకి వస్తే ఎక్కువ గా నష్టపోయేది వైసీపీనే.అందుకే నిమ్మగడ్డ ఇంత సీరియస్ గా దీనిపై దృష్టిపెట్టారా అనే అనుమానంతో వైసీపీ ఉంది.