ముందస్తు ముంచుతుందా .. కేసీఆర్ ప్లాన్ ఏంటి   What Is The KCR Plan On Early Elections In Telangana     2018-09-08   09:49:57  IST  Sai M

తలిచినప్పుడే తాత పెళ్లి జరిగిపోవాలనే మంకుపట్టు కేసీఆర్ ది. తాను ఏమి చెయ్యాలి అనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి చూపించే తెగువ, ధైర్యం కేసీఆర్ లో కనిపిస్తుంటాయి. ముందస్తు ఎన్నికలు మంచిదా కాదా అనే ఆలోచనలోనే అందరూ ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి అందరికి షాక్ ఇచ్చాడు. మాములుగా చూస్తే.. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఏ కోణంలో చూసినా
కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. పైగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు అన్ని పెద్దగా బలం పుంజుకోలేదు. అయినా కేసీఆర్ మాత్రం ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపారు.

ఇప్పుడు ప్రజలందరిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది ..? గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారికి అనుకూల ఫలితాలు రాలేదని తెలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ రద్దువైపే మొగ్గు చూపారంటే దాని వెనుక బలమైన కారణాలు ఏవో ఉండి ఉంటాయి అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్ని కల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో పుంజుకుంటున్నట్లు వార్తలు వెలువడటం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాహుల్‌ గాంధీ పట్ల ప్రజాదరణ పెరగడం వంటి పరిణామాలు కూడా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఒక కారణం కూడా అయ్యి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఆపద్ధర్మ సీఎం హోదాలో ఉండి.. తెలంగాణాలో ఉన్న సమస్యలన్నింటికీ కాంగ్రెస్‌నే కారణమని నిందిస్తున్నారు. ఆ పార్టీ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. ముందస్తుకు వెళ్లేంతగా.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాలు చేయలేదు. అయినా ఆ వంక చూపించి అసెంబ్లీని రద్దు చేశామని అనడం కరెక్ట్ కాదేమో. ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే.. తొమ్మిది నెలలు ముందుగానే ఎందుకు ఎన్నికలు తెచ్చి పెట్టాల్సి వచ్చిందనే భావన పెరిగితే.. అంతిమంగా కేసీఆర్‌కు పూడ్చుకోలేని నష్టం వస్తుంది. నాలుగున్నరేళ్ల పాటు.. ఏమీ చేయకుండా. కాంగ్రెస్‌ను నిందిస్తూ.. మళ్లీ అవకాశం అడగడమేమిటన్న ప్రశ్న ప్రజల్లో సహజంగా వస్తుంది.

What Is The KCR Plan On Early Elections In Telangana-

ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన టీఆర్‌ఎస్‌… ఆయా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు సమయం ఇవ్వకూడదనే ముందస్తుకు మొగ్గుచూపిందనే వాదనలు కూడా వినిపిస్తుండగా … సర్వ్ ఫలితాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా వచ్చాయని .. మరికొంతకాలం ఆగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు తేలడంతో ఇంత కంగారుపడినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.