మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి.ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఆంధ్ర ప్రదేశ్ జిల్లా అనంతపురం,ఆత్మకూరు మండలం, పంపనూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి అని చెప్పవచ్చు.
ఇక్కడ స్వామి వారు భక్తుల కోరికలను తీరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందారు.ప్రతి ఆదివారం, మంగళవారం స్వామివారి దర్శనార్థం అనంతపురం జిల్లా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకొంటారు.
మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఈ ఆలయాలలో ఎంతో మంది సాధువులు నివసిస్తూ తపస్సు చేసుకునే వారు.
క్రీ శకం 1509 -1530 కాలం మధ్యలో శ్రీ కృష్ణ దేవరాయలు గురువు శ్రీ వ్యాస రాజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఈ ఆలయ విశిష్టత తగ్గడంతో ఆలయానికి భక్తులు వచ్చేవారు కాదు.కానీ1980-90 మధ్య కాలం నుంచి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది.ఈ క్రమంలోనే 2008వ సంవత్సరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆలయాన్ని దర్శించి పార్వతి దేవి శివుడు విగ్రహాలను ప్రతిష్టించారు.
ఇక అప్పటి నుంచి రోజు రోజుకు ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికమవుతోంది.
ఈ ఆలయంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలో ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబం మొత్తం చూడొచ్చు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పై భాగంలో సింహా ధ్వజం, నరసింహ అవతారం, విష్ణు తత్వం శ్రీ కృష్ణదేవరాయ రాజవంశ ముద్రణ చూడవచ్చు.మధ్యలో స్వామి వారు మనకు శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు.
ఈ శివలింగ ఆకారం మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది.అలాగే దిగువన పార్వతీదేవిని సూచించే చక్రం చూడవచ్చు.
ఈ చక్రం రాహు కేతు దోష నివారణను తొలగిస్తుంది.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి విగ్రహం పై ఏడు తలల పాము విగ్రహం మనకు కనబడుతుంది.
ఇలా ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ముఖ్యంగా నాగ దోషం, కాలసర్ప దోషం, శనిగ్రహ దోషం,రాహు కేతు దోషాలు ఉన్న భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు.ప్రతి ఆదివారం మంగళవారం ఈ ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
ఇక కార్తీక మాసం, మాఘమాసం, మహాశివరాత్రి వంటి పర్వ దినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనార్థం అనంతపురం జిల్లా నుంచి మాత్రమే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం విశేషం.