మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలన్నింటిలోనూ ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు.ముఖ్యంగా ఎంతో మంది యువతీ యువకులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలలో వివాహ సమస్య.
చాలామందికి జాతకంలో దోషాల రీత్యా వివాహాలు కాక ఎంతో బాధపడుతుంటారు.ఈ క్రమంలోనే అలాంటి దోషాలున్నవారు కొన్ని ఆలయాలను సందర్శించి పూజలు చేయటం వల్ల దోషాలు తొలగి పోయి వివాహం కలుగుతుందని చెబుతుంటారు.
అలాంటి ఆలయాలలో ఒకటిగా పేరు గాంచినదే పెండ్లి గంగమ్మ ఆలయం.మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ పెండ్లి కనుమ అనే గ్రామంలో గంగమ్మ ఆలయం ఉంది.ఈ గ్రామంలో కోటప్ప నాయుడు అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు కలలో కనిపించి ఫలానా చోట నేను ఉన్నాను నన్ను ప్రతిష్టించమని చెప్పగా ఆ వ్యక్తి వెళ్లి ఆ ప్రాంతంలో చూస్తే అక్కడ అమ్మవారు విగ్రహం కనిపించడంతో కోటప్ప నాయుడు అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి ఆలయం నిర్మించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
కొన్ని వందల సంవత్సరాల నుంచి విశేష పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆలయానికి ఆ ప్రాంతంలోని ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారి పూజలో పాల్గొంటారు.

ముఖ్యంగా ఈ ఆలయానికి పెళ్లికాని యువతీ యువకులు, సంతానం కానీ దంపతులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు.ఈ అమ్మవారి ఆలయంలో విగ్రహం పక్కనే రెండు రాళ్ళు ఉంటాయి.ఒకటి పోతురాయి కాగా మరొకటి పెట్టరాయి.
సుమారు ఇవి 100 కిలోల బరువు ఉంటాయి.ఈ ఆలయంలోనికి వచ్చిన భక్తులు వారి కోరికలు నెరవేరాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బండరాళ్లను భక్తితో ఎత్తితే వారికి సమస్యలు తీరిపోయి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు.
ముఖ్యంగా పెళ్లి కాని యువతీయువకులు సంతానం లేనివారు ఈ బండరాళ్లను ఎత్తడం వల్ల వారికి సంతాన యోగం, పెళ్లి యోగం కలుగుతుందని భావిస్తారు.ఈ విధంగా అమ్మవారి జాతర సమయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.