మనం కొత్త ఇంటిని నిర్మించాలని భావించినప్పుడు ఇంటికి సరిపడే స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఇంటి నిర్మిస్తుంటారు.ఇంటి నిర్మాణ ప్రక్రియలో ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తాము.
కేవలం కొత్త ఇంటి నిర్మించడానికి మాత్రమే కాకుండా సింహ ద్వారం ఎటువైపు పెట్టాలి అన్నది కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే పరిగణలోకి తీసుకొని పెడుతుంటారు.ఇంటి సింహద్వారాన్ని 16 విధాలుగా ఉంచి ఇంటిని నిర్మించవచ్చు.
వీటినే షోడశ గృహ నిర్మాణం అని కూడా పిలుస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం ఏ దిశలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
1) ధ్రువ గృహం: ధ్రువ గృహం అంటే నాలుగు దిక్కులు గోడలు నిర్మించి సింహద్వారం పై వైపుకు పెట్టుకోవడాన్ని ధ్రువ గృహం అంటారు.ఇలాంటి ఇళ్లను పూర్వకాలంలో నిర్మించేవారు.
2) ధాన్య గృహం: తూర్పువైపు మాత్రమే సింహద్వారం కలిగిన ఇంటిని ధాన్య గృహం అంటారు.ఇలాంటి సింహద్వారం కలిగిన ఇల్లు శత్రు వినాశనం చేస్తుంది.
3) జయ గృహము: దక్షిణం వైపు సింహద్వారం ఉన్న ఇంటిని జయ గృహము అంటారు.ఇల్లు శత్రువులపై విజయాన్ని సాధిస్తుంది.

4) నంద గృహము: తూర్పు, దక్షిణ దిశలో సింహద్వారం ఉంటుంది.ఇలాంటి ఇంటిలోని స్త్రీలు రోగాల బారిన పడతారు.
5)ఖర గృహము: పడమర వైపు మాత్రమే సింహద్వారం కలిగిన ఇంటిని ఖర గృహము అంటారు.ఇలాంటి ఇంట్లో ఉండటం వల్ల సంపదలు నశించిపోతాయి.
6) కాంత గృహము: ఈ విధమైన ఇంటికి తూర్పు, పడమర సింహద్వారం ఉంటుంది.ఇలాంటి ఇంటిలో ధనాభివృద్ధి, సంతానాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు.
7) మనోరమ గృహము:దక్షిణ, పడమర దిశలో సింహద్వారం కలిగి ఉంటుంది.ఇలాంటి ఇంటిలో మానసిక ఆనందం, సిరిసంపదలు వెల్లువెత్తాయి.
8) సుముఖ గృహము: తూర్పు, పడమర, దక్షిణ దిశలలో సింహద్వారాలు కలిగి ఉన్న ఇంటిని సుముఖ గృహము అంటారు.ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
9) దుర్ముఖ గృహము: ఉత్తర దిశలో మాత్రమే సింహద్వారం కలిగిన ఇంటిని దుర్ముఖ గృహము అంటారు.ఈ ఇంటిలో సోదరుల మధ్య అనుబంధాలు ఉండక విడిపోతారు.
10) క్రూర గృహము: తూర్పు, ఉత్తర దిశలలో సింహద్వారం ఉన్న ఇంటిని క్రూర గృహము అంటారు.ఈ ఇంటిలో నివసించే వారికి దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపిస్తాయి.
11) సూపక్ష శాల గృహము: ఉత్తర, దక్షిణ దిశలో సింహద్వారం ఉన్న ఇంటిని సూపక్ష శాల గృహము అంటారు.ఇంట్లో నివసించే వారి వంశ అభివృద్ధి జరుగుతుంది కానీ శత్రువుల భయం అధికంగా ఉంటుంది.

12) ధన గృహము: తూర్పు, దక్షిణ, ఉత్తర ద్వారాలు కలిగిన ఇంటిని దన గృహము అంటారు.ఇంట్లో నివసించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
13) క్షయ గృహము: పడమర, ఉత్తర దిశలో సింహద్వారం ఉన్నటువంటి ఇంటిని అక్షయ గృహము అంటారు.ఇలాంటి ఇంటిలో నివసించి వ్యాపారం చేసే వారికి వ్యాపార నష్టాలు కలుగుతాయి.
14) అక్రంధ గృహము: తూర్పు, పడమర, ఉత్తర దిశలో ద్వారం కలిగిన ఇంటిని అక్రంద గృహము అంటారు.ఇలాంటి ఇంటిలో నివసిస్తే బందు నాశనం కలుగుతుంది.
15) విపుల గృహము: ఉత్తర, పడమర, దక్షిణ దిశలలో ద్వారం కలిగిన ఇంటిని విపుల గృహము అంటారు.ఇంటిలో ఉన్న వారికి దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది.
16) జయ గృహము: నాలుగు వైపులా ద్వారాలున్న ఇంటిని జయ గృహము అంటారు.ఇలాంటి ఇంటిలో నివసిస్తే ధన ధాన్య సంపద కలుగుతుంది.