అమెరికాలో భారతీయుడికి అరుదైన గౌరవం కల్పించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా భారతీయ అమెరికన్ సుదర్శనం బాబును నియమిస్తూ ట్రంప్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.వోక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరీ (ఓఆర్ఎన్ఎల్)లో పనిచేస్తున్న సుదర్శనం బాబు నేషనల్ సైన్స్ బోర్డు సభ్యునిగా ఆరేళ్ల పాటు పదవిలో ఉంటారు.
1986లో కోయంబత్తూరులోని పీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఈటలర్జీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సంపాదించారు.ఆ తర్వాత 1988లో ఐఐటీ మద్రాస్ నుంచి ఇండస్ట్రీయల్ మెటలర్జీ-వెల్డింగ్) నుంచి పట్టా పొందారు.అనంతరం కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్ మరియు మెటలర్జీలో పీహెచ్‌డీ సాధించారు.
ప్రస్తుతం బ్రెడ్‌సన్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా, ఓఆర్ఎన్ఎల్ గవర్నర్ చైర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ గాను వ్యవహరిస్తున్నారు.
నేషనల్ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా ఓఆర్ఎన్ఎల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ మధ్య ఆయన వారధిగా పనిచేయాల్సి ఉంటుంది.దేశంలో పరిశోధనకు అనువైన వాతావరణం కల్పించడానికి సుదర్శనం బాబు కృషి చేయాలి.అధునాతన తయారీ, సంతులిత తయారీ, భౌతిక లోహశాస్త్రం తదితర అంశాలపై ఆయనకు 21 సంవత్సరాల అనుభవం ఉంది.
నేషనల్ సైన్స్ బోర్డు సభ్యుడిగా ఓ భారత సంతతి పౌరుడు ఎంపికవ్వడం ఇది మూడోసారి.సుదర్శనం బాబు కంటే ముందు అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన సేతురామన్ పంచనాథన్, వెర్మోంట్ యూనివర్సిటీకి చెందిన సురేశ్ వి గరిమెళ్ల ఈ ప్రతిష్ట్మాత్మక బోర్డుకు సభ్యులుగా నియమితులయ్యారు.