నల్లమల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పది మంది చెంచులు సేఫ్

నల్లగొండ జిల్లా:నల్లమల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న చెంచులను కాపాడేందుకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెస్క్యూ టీమ్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు తెలిపారు.

మంగళవారం డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.

నల్లగొండ జిల్లా డిండి మండలం దెయ్యం గుండ్లకు చెందిన పది మంది చెంచులు సోమవారం మధ్యాహ్న సమయంలో తేనె వేటకు గోనబోయినపల్లి నుంచి నల్లమల అడవిలోకి వెళ్ళి ఒక్కసారిగా దుందుభి వాగు ఉదృతి పెరగడంతో అడవిలోని వాగు అవతల చిక్కుకున్నారు.రాత్రంతా నల్లమలలో బిక్కు బిక్కు మంటూ జాగారం చేయడంతో బాధిత కుటుంబాలు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రెవిన్యూ, అటవీ,పోలీసు శాఖల అధ్వర్యంలో దేవరకొండ డిఎస్పీ గిరిబాబు,డిండి సీఐ సురేష్,ఎస్ఐ రాజులతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా వాగు అవతల చిక్కుకున్నారన్న సమాచారంతో సోమవారం నుండి నుంచి రెవిన్యూ,అటవీ, పోలీస్ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

మంగళవారం డ్రోన్ కెమెరాతో వారిని గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకొచ్చి,సురక్షిత ప్రాంతానికి తరలించారు.భాదితుల దగ్గరికి ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే బాలూ నాయక్ చేరుకొని వారికి ధైర్యాన్నిచ్చారు.

Advertisement

ఆ తర్వాత వారిని వారి స్వగ్రామానికి చేర్చారు.తమ కుటుంబ సభ్యులను ప్రాణాలతో రక్షించి తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పదిమంది ప్రాణాలు కాపాడిన నల్గొండ జిల్లా పోలీసులకు తెలంగాణ డిజిపి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు తెలియజేశారు.

Advertisement

Latest Nalgonda News