నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.బెల్ట్ షాపు లేని ఊరికి అభివృద్ది ఫండ్ కూడా ప్రకటించారు.
కానీ,నాంపల్లి మండలంలోని ప్రసాద్ వైన్స్ యాజమాన్యం మాత్రం ఎమ్మేల్యే చెబితే మేం వినాలా…? మాషాపు మా మద్యం,మా ఇష్టం బరాబర్ బెల్ట్ దందా నడుపుతాం, ఎమ్మార్పీ కంటే అదనంగా మద్యం విక్రయాలు చేస్తాం అంటూ యధేచ్చగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.దీనితో బెల్ట్ మద్యం నిషేధం అని ఎమ్మెల్యే చేసిన శాసనం నాంపల్లి మండలంలో నీరుగారి పోయిందని మండల ప్రజలు అంటున్నారు.
దీనిని కంట్రోల్ చేయాల్సిన సంబధిత అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అందుకే కళ్ళ ముందే ఖరీదైన మద్యం బెల్ట్ షాపులకు తరలిపోతున్నా తమకేమీ పట్టనట్లు చోద్యంచూస్తున్నారని భావిస్తున్నారు.
బెల్ట్ దందాపై మీడియా,సోషల్ మీడియా ద్వారా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చీమ కుట్టినట్లు కూడా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే సదరు వైన్స్ షాపు స్కూల్ కి దగ్గరగా నివాసాల మధ్యన ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎక్సైజ్ శాఖకు చలనం లేకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యే సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా హర్శిస్తుంటే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం అటు అధికారులు,ఇటు వైన్స్ యాజమాన్యం ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆయనకు చెడ్డ పేరు తెచ్చే పనికి పూనుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ఎమ్మెల్యే బెల్ట్ షాపుల నిర్మూలనే లక్ష్యంగా సిరియస్ గా దృష్టి సారించి,బెల్ట్ దందాకు పాల్పడుతున్న వైన్స్ షాపుల లైసెన్స్ రద్దు చేయించి,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని,మద్యం దందాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.