కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది.ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ఆకాశ దీపాన్ని పెట్టటం చూస్తూ ఉంటాం.
చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు.
ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వెళుతూ ఉంటారు.
అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం వుంది.ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు … ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది.‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే.అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు.కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు.
ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.