తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి కెక్కిన ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయస్వామి గుడి ఒకటి.ఇది జగిత్యాల జిల్లాలో కొలువై ఉంది.
కోరిన కోర్కెలు తీరుస్తూ.భక్తుల కొంగు బంగారమయ్యే అంజన్న గుడికి ఏటా వేలమంది భక్తులు వస్తుంటారు.
కొండ గట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ.లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది.ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగు తాయని భక్తుల విశ్వాసం.ఇక్కడికి రాష్ట్ర ప్రజలే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తుంటారు.
సుమారు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరాగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది.దాన్ని వెతికి వెతికి విసిగిపోయిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట.
కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.భక్తి భావంతో కోరంద ముళ్లపొదల్లో వెతగ్గా స్వామివారి విగ్రహం కనిపించింది.దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి చిన్న ఆలయం నిర్మించి పూజలు నిర్వహించేవాడని చరిత్రకారులు చెబుతారు.
చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది.
శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగ నాయకుల కళ్యాణం జరుగుతుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు.దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
కొండ గట్టుకు ఇలా చేరుకోవచ్చు.
హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండ గట్టుకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు ఉంటాయి.జగిత్యాలకు వెళ్లే బస్సు ఎక్కితే నేరుగా కొండగట్టులో దిగొచ్చు.కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసు ఉంది.కరీంనగర్ నుంచి క్యాబ్‌లు, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.