ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలై వైసిపి ( YCP )ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి, ఆ పార్టీ అధినేత జగన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు .ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు.
ఆ తరువాత పులివెందుల, అక్కడి నుంచి బెంగళూరుకు మకాం మర్చారు.రాజకీయ అంశాలపై పెద్దగా స్పందన లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి కూటమికి కొంతకాలం సమయం ఇచ్చి, ఆ తర్వాత జనాల్లోకి రావాలని , అంతకంటే ముందుగా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి నాయకుల్లో ఉత్సాహం నింపే విధంగా జగన్ సైలెంట్ గా వ్యూహాలు రచిస్తున్నారు.ఇక దాడులకు గురైన పార్టీ నాయకులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
తాను పూర్తిగా ప్రజల్లోకి వచ్చే విధంగా జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు కేడర్ ను పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు.ఈ మేరకు జగన్ తొలి పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు రేపు గురువారం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy )ని జగన్ ఓదార్చనున్నారు .ఈవీఎం ధ్వంసం, టిడిపి ఏజెంటట్ , మహిళపై దాడి, కారంపూడి సిఐపై హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది దీంతో పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు.
ఇప్పటికే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి పిన్నెల్లిని పరామర్శించారు.రేపు గురువారం జగన్ నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి ని పరామర్శించనున్నారు.
నాలుగో తేదీన ఉదయం 9.40 గంటలకు హెలికాప్టర్ లో నెల్లూరుకు జగన్ వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడు గుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్తారు.ఈ మేరకు పార్టీ శ్రేణులు జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టారు.ఇక పిన్నెల్లి ని పరామర్శించిన తరువాత పార్టీ నేతలతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్ చేయగా , ఈసారి జరిగిన ఎన్నికల్లో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఒక్క స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోలేకపోయింది.దీంతో నెల్లూరు జిల్లా వైసీపీ భవిష్యత్ కార్యాచరణ పై జగన్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.పిన్నెల్లి పరామర్శ తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల తర్వాత దాడులకు గురైన పార్టీ క్యాడర్ ను పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.