దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి హీరో అయిపోయారు.ఎంతోమంది మన్ననలు అందుకుంటున్నారు.
దిశ హత్యాచారం కేసులో పోలీసులు స్పందించిన తీరు అద్భుతమంటూ ప్రశంసలూ కురుస్తున్నాయి.అయితే ఈ హీరో పోలీసుల అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభం కానున్నట్లు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదవుతుంది.ఎన్‌కౌంటర్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లతోపాటు పైనుంచి పర్యవేక్షించిన వాళ్లు కూడా ఈ కేసుల్లో చిక్కుకుంటారు.
దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ను అందరూ సమర్థిస్తున్నా.న్యాయపరంగా మాత్రం ఆ పోలీసులకు చిక్కులు తప్పవు.

అసలు నిబంధనల ప్రకారం వీళ్లకు ప్రభుత్వం నుంచిగానీ, పోలీస్ శాఖ నుంచి గానీ ఎలాంటి న్యాయ సాయం అందదు.దీంతో సాధారణంగా ఎన్‌కౌంటర్ కేసుల్లో పోలీసులు తమను తాము నిర్దోషులమని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది.ఇప్పుడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోనూ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది.
పలువురు స్వచ్ఛందంగా ఆ పోలీసులపై కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఇలా ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులు ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కొందరు ఉద్యోగాలు పోగొట్టుకొని, జైలు పాలయ్యారు.
మరికొందరు కోర్టు ఖర్చులు భరించలేక తల పట్టుకున్నారు.ఇప్పుడు కూడా సీపీ సజ్జనార్‌తోపాటు ఎన్‌కౌంటర్‌లో ఉన్న ఇతర పోలీసులపై బయటి ప్రపంచం ప్రశంసలు కురిపిస్తున్నా.
ఒకసారి న్యాయప్రక్రియ ప్రారంభమైతే మాత్రం వీళ్లకు కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి.