రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో ప్రజలను కలిసేందుకు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యి భవిష్యత్ ప్రణాళికపై ప్రసంగించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.తొమ్మిదిన్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో అనేది అన్నిచోట్ల వివరిస్తున్నట్లు పురందరేశ్వరి తెలియజేశారు.
జల్ జీవన్ మిషన్ కార్యక్రమంతో ప్రతి ఇంటింటికి కుళాయిలు ఉచితంగా అందజేశామన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి ఉండాలి కానీ ప్రస్తుత రాజకీయ పార్టీలు పోలవరం ప్రాజెక్టు పేరుతో డబ్బులు తోడుకుంటున్నాయని పురందరేశ్వరి విమర్శించారు.త్వరలో పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ జరిగే అవినీతిని మొత్తం బయటపెడతామని వెల్లడించారు.
జగనన్న కాలనీ పరిస్థితి అందరూ చూస్తున్నారని చిన్నపాటి వర్షానికి పునాదులతో సహా పలుచోట్ల కూలిపోయాయని పురందరేశ్వరి అన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని అన్నారు.
ప్రశ్నిస్తే తిరిగి వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పురందరేశ్వరి మండిపడ్డారు.తుఫాను దాటికి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కలిసి వివరించామని తెలిపారు.
రాష్ట్రంలో బోగస్ ఓట్లపై ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసామన్నారు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తు అలానే ఉందని మిగతా పార్టీలతో పొత్తు అనే విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని వెల్లడించారు.