సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి

నల్లగొండ జిల్లా:జిల్లాలోని నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై పానగల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.

నల్లగొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.

నల్లగొండ పట్టణం శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌ రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలోని తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్న సినీ నటుడు రఘుబాబు వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు.

దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడడంతో తల,ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

జనార్దన్‌ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినట్లు సీఐ డానియేల్‌ తెలిపారు.

Advertisement

Latest Nalgonda News